Telangana: ఉప్పుడు బియ్యం కొనబోమన్న కేంద్రం.. రైతులకు ఇక ఉరేనన్న తెలంగాణ అధికారులు!

  • కేంద్రం వద్ద ఐదేళ్లకుపైగా నిల్వలు
  • కిలో బాయిల్డ్ రైస్‌ను కూడా కొనలేమన్న మంత్రి పీయూష్
  • కేంద్రం నిర్ణయం రైతులకు ఉరిలాంటిదేనని అభిప్రాయం
  • ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించాలని నిర్ణయం
kcr says farmers may no longer cultivate paddy crop

ఉప్పుడు బియ్యం (బాయిల్డ్ రైస్)ను ఇకపై కొనబోమని కేంద్రం తేల్చి చెప్పిన నేపథ్యంలో ఇక రైతులకు మిగిలింది ఉరి మాత్రమేనని తెలంగాణ వ్యవసాయ శాఖ ఉన్నత సమీక్ష సమావేశంలో పలువురు అధికారులు అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన వ్యవసాయ పంటల సాగు, ధాన్యం కొనుగోలు తదితర అంశాలపై నిన్న ప్రగతి భవన్‌లో సమీక్ష సమావేశం జరిగింది.

ఉప్పుడు బియ్యాన్ని కొనబోమన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ఈ సమావేశంలో చర్చించారు. కేంద్రం తాజా నిర్ణయంతో రాష్ట్రంలోని బాయిల్డ్ రైస్ మిల్లులు మూతపడతాయని, వచ్చే యాసంగి నుంచి వరి పంట అంటే రైతులు ఉరి వేసుకోవడమేనన్న అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేశారు.

యాసంగిలో వరికి ప్రత్యామ్నాయంగా శనగలు, వేరు శనగ, పెసర్లు, మినుములు, నువ్వులు, ఆవాలు, పొద్దు తిరుగుడు, ఆముదం, కూరగాయలు వేసుకోవడమే మంచిదన్నారు. గత యాసంగిలో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎఫ్‌సీఐ ద్వారా తీసుకోవాలని, దీనివల్ల వానాకాలం పంట నిల్వకు స్థలం లభిస్తుందని మంత్రులు గంగుల కమలాకర్, కేటీఆర్ ఇటీవల కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.

అయితే, ఇప్పటికే ఐదేళ్లకు పైగా నిల్వలున్నాయని, అదనంగా ఒక్క కిలో బాయిల్డ్ రైస్‌ను కూడా కొనలేమని గోయల్ తేల్చి చెప్పారు. అంతేకాదు, ప్రస్తుత వానాకాలంలో 60 లక్షల టన్నులకు మించి ధాన్యాన్ని తీసుకోబోమని కేంద్రం తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని అధికారులు కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. గత యాసంగిలో సేకరించిన ధాన్యం కారణంగా ప్రభుత్వంపై అదనంగా దాదాపు రూ. 2 వేల కోట్ల భారం పడే అవకాశం ఉందన్నారు.

కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయం నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులను చైతన్య పరచాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. రాష్ట్రంలో పంటసాగు పెరగడంతో అంతర్జాతీయ స్థాయిలో ఎగుమతులను ప్రోత్సహించడం, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర వ్యవసాయాధారిత పరిశ్రమలను ఏర్పాటు చేయడం వంటి విషయాలపై కేంద్రం దృష్టిసారించడం లేదని అధికారులు అభిప్రాయపడ్డారు. కాగా, ప్రస్తుత వానాకాలంలో కేంద్రం నిర్దేశించిన 60 లక్షల టన్నుల ధాన్యాన్నే కొనుగోలు చేయాలని అధికారులు నిర్ణయించారు.

More Telugu News