Andhra Pradesh: జులైలో చనిపోయిన వ్యక్తికి ఇప్పుడు రెండు డోసులు పూర్తిచేశారట.. వైద్య సిబ్బందిపై విమర్శలు

  • టీకాలు వేయించుకోకున్నా వేయించుకున్నట్టు మెసేజ్‌లు
  • లక్ష్యాన్ని చేరుకునేందుకు అడ్డదారులు
  • ఆధార్ కార్డులు, ఫోన్ నంబర్లు సేకరించి మెసేజ్‌లు
Vaccination given to a man who died two months ago

టీకా కార్యక్రమంలో వైద్యుల నిర్లక్ష్యానికి అద్దంపట్టే ఘటన ఇది. ఎప్పుడో చనిపోయిన వ్యక్తికి ఇప్పుడు వ్యాక్సినేషన్ పూర్తిచేశారట. అనంతపురం జిల్లాలో జరిగిందీ ఘటన. హిందూపురంలో నివాసం ఉంటున్న అనంతపురానికి చెందిన వ్యక్తి జులైలో అనారోగ్యంతో మరణించాడు. ఆయనకు కరోనా టీకా రెండు డోసులు పూర్తయ్యాయంటూ కుమారుడి సెల్‌ఫోన్‌కు నిన్న మెసేజ్ వచ్చింది. అది చూసి నిర్ఘాంతపోయాడు. అదే కుటుంబానికి చెందిన మరో వ్యక్తికి ఇప్పటికే రెండు డోసుల టీకాలు పూర్తికాగా, తాజాగా తొలి డోసు పూర్తిచేసుకున్నట్టు సాయంత్రం మెసేజ్ వచ్చింది. ఒకే రోజు ఇలా రెండు తప్పుడు మెసేజ్‌లు రావడంతో కుటుంబ సభ్యులు షాకయ్యారు.

దీంతో వ్యాక్సినేషన్ కార్యక్రమంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల వారీగా టీకాలు వేస్తుండగా, మునిసిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు పర్యవేక్షిస్తున్నారు. కొందరు సిబ్బంది లక్ష్యాన్ని చేరుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నట్టు ఈ ఘటనలు నిరూపిస్తున్నాయి. ఆధార్ కార్డులు, ఫోన్ నంబర్లు సేకరించి టీకాలు వేయకుండానే వేసినట్టు నమోదు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై ఫిర్యాదులు అందుతున్నా సాంకేతిక లోపం పేరుతో అధికారులు తప్పించుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

More Telugu News