USA: 9/11 ఉగ్రదాడి: సౌదీకి అమెరికా క్లీన్​ చిట్​

USA Gives Clean Chit To Saudi Arabia On Sept 11 Attacks On Twin Towers
  • హైజాకర్లకు సాయం చేసిందని అప్పట్లో ఆరోపణలు
  • అందుకు ఆధారాలు లేవని తాజాగా వెల్లడించిన ఎఫ్ బీఐ
  • దర్యాప్తు నివేదికను బయటపెట్టిన అధికారులు
  • సౌదీ ప్రభుత్వ చారిటీలు సాయం చేసి ఉండొచ్చని వెల్లడి
అమెరికా 9/11 దాడులు జరిగి నిన్నటికి 20 ఏళ్లు పూర్తయ్యాయి. రెండు విమానాలతో న్యూయార్క్ లోని ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీసీ) టవర్స్ సహా జంట భవనాలను అల్ ఖాయిదా ఉగ్రసంస్థ కూల్చేసింది. అధికారిక లెక్కల ప్రకారం ఈ ఉగ్రదాడిలో 3 వేల మందికిపైగా మరణించారు. ఉగ్రదాడిపై ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్ బీఐ) ఎందరినో విచారించింది. ఆ దర్యాప్తు వివరాలన్నింటినీ అధికారులు రహస్యంగా ఉంచారు.

విమానాలను హైజాక్ చేసిన ఉగ్రవాదులకు సౌదీ అరేబియా ప్రభుత్వం సహకరించినట్టు అప్పట్లో ఎన్నెన్నో ఆరోపణలు వచ్చాయి. దీంతో రహస్య విచారణకు సంబంధించిన వివరాలను బయటపెట్టాలంటూ దాడిలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులు ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చారు. ఈ నేపథ్యంలోనే విచారణ వివరాలను బయట పెట్టాలంటూ ఎఫ్ బీఐ అధికారులను దేశాధ్యక్షుడు జో బైడెన్ ఆదేశించారు.

తాజాగా ఆ వివరాలను ఎఫ్ బీఐ విడుదల చేసింది. ఉగ్రదాడితో సౌదీ అరేబియాకు సంబంధం ఉందనడానికి ఎలాంటి ఆధారాలూ లేవని 16 పేజీల డాక్యుమెంట్లలో వెల్లడించింది. ఉగ్రవాద దాడిలో పాల్గొన్న హైజాకర్లతో సంబంధాలుండడంతో నాడు సౌదీ దౌత్యవేత్తలనూ విచారించినట్టు పేర్కొంది. అయితే, నేరుగా హైజాకర్లతో సౌదీ ప్రభుత్వానికి కాంటాక్ట్ లున్నట్టు మాత్రం ఎలాంటి ఆధారాలు లేవని అందులో పేర్కొంది. అల్ ఖాయిదా ఉగ్రవాదులకు నేరుగా నిధులనూ ఇవ్వలేదని చెప్పింది.

అయితే, సౌదీ నిధులను అందించిన ప్రభుత్వ చారిటీలు.. ఉగ్రవాదులకు డబ్బులను అందించి ఉంటాయని పేర్కొంది. నవాఫ్ అల్ హజ్మీ, ఖాలిద్ అల్ మిధార్ అనే ఇద్దరు హైజాకర్లు మొదట అమెరికాకు వచ్చారని, 2000 ఫిబ్రవరిలో కాలిఫోర్నియాలోని ఓ హలాల్ రెస్టారెంట్ లో సౌదీకి చెందిన ఒమర్ అల్ బయౌమి అనే వ్యక్తిని కలిశారని ఎఫ్ బీఐ పేర్కొంది. అతడే వారిద్దరికీ శాన్ డయీగోలో ఇల్లు ఇప్పించాడని, అతడికి సౌదీ ప్రభుత్వంతో సంబంధాలున్నాయని వెల్లడించింది.
USA
9/11 Attacks
Al Qaeda
Osama Bin Laden
Joe Biden
FBI

More Telugu News