Sai Dharam Tej: నిన్న సాయంత్రం వాళ్లిద్దరూ మా ఇంటి నుంచే వెళ్లారు!: సీనియర్ సినీ నటుడు నరేశ్

Warned Sai Dharam Tej many times on bike riding says Naresh
  • సాయితేజ్, మా అబ్బాయి మంచి స్నేహితులు  
  • సాయితేజ్ నా బిడ్డలాంటివాడు
  • వీళ్లకి కౌన్సెలింగ్ ఇద్దామనుకున్నాను  
  • త్వరలోనే వెళ్లి కలుస్తానన్న నరేశ్ 
వేగంగా బైక్ ను నడుపుతూ సినీ హీరో సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. యాక్సిడెంట్ జరిగిన వెంటనే అపస్మారకస్థితిలోకి వెళ్లిన ఆయన ఆ తర్వాత స్పృహలోకి వచ్చారు. మరోవైపు ఈ ఘటనపై సీనియర్ సినీ నటుడు నరేశ్ స్పందించారు.

"సాయితేజ్, మా అబ్బాయి ఇద్దరూ మంచి స్నేహితులు. బ్రదర్స్ లా వుంటారు. సాయితేజ్ నా బిడ్డలాంటివాడు. త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. నిన్న సాయంత్రం వీళ్లిద్దరూ మా ఇంటి నుంచే వెళ్లారు. వాళ్ల బైక్స్ సౌండ్ విని, వేగంగా వెళ్లొద్దని చెబుదామని బయటకు వచ్చాను. అంతలోనే ఇద్దరూ వెళ్లిపోయారు. బైకులు వేగంగా నడపొద్దని నాలుగు రోజుల క్రితం వీళ్లకి కౌన్సెలింగ్ ఇద్దామనుకున్నాను కూడా.

ఇద్దరూ పెళ్లి కావలసిన వాళ్లు, మంచి వయస్సులో వున్న వాళ్లు. ఇలాంటి వయసులో రిస్కులు తీసుకోకూడదు. గతంలో ఒకసారి నేను కూడా బైక్ ప్రమాదానికి గురైతే, మా అమ్మ నా చేత ఒట్టు వేయించుకుని, బైక్ నడపడం మానిపించారు. ఇప్పుడు అపోలో ఆసుపత్రికి వెళ్లి సాయిని పరామర్శించాలని వున్నా, అక్కడి పరిస్థితులను బట్టి వెళ్లలేకపోతున్నాను. త్వరలోనే వెళ్లి కలుస్తాను. సాయి పూర్తి ఆరోగ్యంతో ఇంటికి రావాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు నరేశ్.
Sai Dharam Tej
Naresh
Tollywood
Riding

More Telugu News