Nellore: నిద్రలోనే మరణించిన కుమారుడు.. మూడు రోజులుగా ఇంట్లోనే పెట్టుకుని విలపిస్తున్న తల్లి

Son Died while sleeping mother kept his dead body at home for three days
  • నెల్లూరులోని ఫత్తేఖాన్‌పేటలో ఘటన
  • ఉదయం ఆలస్యంగా నిద్రలేపమని తల్లికి చెప్పి నిద్రపోయిన కుమారుడు
  • ఇరుగుపొరుగువారి ఫిర్యాదుతో విషయం వెలుగులోకి
నిద్రలోనే మరణించిన కుమారుడికి దహన సంస్కారాలు చేయకుండా, మృతదేహాన్ని మూడు రోజులుగా ఇంట్లోనే ఉంచుకుందా తల్లి. చివరికి మృతదేహం కుళ్లిపోయి వాసన వస్తుండడంతో అనుమానించిన ఇరుగుపొరుగువారు పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. నెల్లూరులోని ఫత్తేఖాన్‌పేటలో జరిగిందీ ఘటన.

పోలీసుల కథనం ప్రకారం.. వెంకటరాజేశ్‌కు (37) రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. భర్తతో విభేదాల కారణంగా భార్య ఇటీవల పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య తనను విడిచి వెళ్లిపోవడంతో రాజేష్, అతడి తల్లి మానసికంగా కుంగిపోయారు. ఈ నెల 5న రాత్రి రాజేశ్ నిద్రపోతూ ఉదయం తనను ఆలస్యంగా నిద్రలేపాలని తల్లికి చెప్పాడు. సరేనన్న తల్లి ఉదయం అతడిని నిద్రలేపలేదు.

సాయంత్రమైనా కుమారుడు ఇంకా లేవకపోవడంతో లేపేందుకు ప్రయత్నించింది. అతడిలో కదలికలు లేకపోవడంతో మరణించాడని గుర్తించిన ఆమె కుప్పకూలిపోయింది. అయితే, ఈ విషయాన్ని ఎవరికీ చెప్పని ఆమె మూడు రోజులుగా కుమారుడి మృతదేహం వద్ద విలపిస్తోంది.

శవం మూడు రోజులుగా ఇంట్లోనే ఉండడంతో కుళ్లిపోయి దుర్వాసన వస్తుండడంతో భరించలేని ఇరుగుపొరుగువారు పోలీసులకు సమాచారం అందించారు. వారొచ్చి చూడగా కుళ్లిన స్థితిలో ఉన్న రాజేశ్ మృతదేహం కనిపించింది. వెంటనే దానిని స్వాధీనం చేసుకుని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రాజేశ్ సోదరుడు రమేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Nellore
Son
Mother
Andhra Pradesh
Dead

More Telugu News