Telangana: ఏపీ, తెలంగాణలో ‘ఏవై.12’ కలకలం.. రెండు రాష్ట్రాల్లోనూ పెరుగుతున్న కేసులు

AY 12 sub Variant in Telangana and Andhrapradesh
  • భయపెడుతున్న ఏవై.12 సబ్ వేరియంట్
  • శరవేగంగా వ్యాప్తి
  • ఏపీలో 18, తెలంగాణ 15 కేసుల నమోదు
  • అప్రమత్తంగా ఉండాలన్న కేంద్ర ఆరోగ్య శాఖ
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను ఇప్పుడు ‘ఏవై.12’ రకం కరోనా వేరియంట్ ఆందోళనకు గురిచేస్తోంది. దేశంలో కరోనా రెండో దశ ఉద్ధృతికి కారణమైన డెల్టా ప్లస్ వేరియంట్‌లో ఇది ఉపరకం. ఇది శరవేగంగా వ్యాప్తి చెందడంతో వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వేరియంట్ గత నెల 30న ఉత్తరాఖండ్‌లో వెలుగు చూడగా, వారం రోజుల్లోనే తెలుగు రాష్ట్రాలకు పాకింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 178 కేసులు నమోదు కాగా, ఏపీలో 18, తెలంగాణలో 15 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలోని వికారాబాద్‌లో 9, వరంగల్‌లో నాలుగు, హైదరాబాద్‌లో 2 కేసులు వెలుగు చూశాయి. కేసుల విషయంలో ఉత్తరాఖండ్‌తో కలిసి ఏపీ మూడో స్థానంలో ఉంది.

డెల్టాప్లస్ వేరియంట్‌కు సంబంధించి తమ వద్ద ఉన్న నమూనాలను మళ్లీ పరీక్షించిన సీసీఎంబీ.. వైరస్ వ్యాప్తి వేగం పెరుగుతున్నట్టు గుర్తించింది. ఊపిరితిత్తుల కణాల్లో అది బలంగా అతుక్కుపోతోందని, మోనోక్లోనల్ యాంటీబాడీ స్పందనను అది తగ్గిస్తోందని గుర్తించారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. సాధారణ కార్యకలాపాలు మళ్లీ పెరుగుతుండడంతో వ్యాధి సంక్రమణ అవకాశాలు మళ్లీ పెరిగాయని నిపుణులు చెబుతున్నారు.

మరోవైపు, ఏప్రిల్ నుంచి దేశంలో డెల్టా వైరస్ కేసులు కూడా పెరుగుతున్నట్టు చెబుతున్నారు. డెల్టా ప్లస్ వేరియంట్‌‌లో పుట్టుకొచ్చిన ఉప రకాలను ఏవై.1, ఏవై.2, ఏవై.3.. వంటి పేర్లతో పిలుస్తున్నారు. ఏవై.12 వేరియంట్‌ను కేంద్ర ఆరోగ్యశాఖ ఇప్పటికే ‘వేరియంట్ ఆఫ్ కన్సర్న్’గా ప్రకటించింది. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ కేసులు బయటపడడంతో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ కేంద్ర ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి ఆర్తి అహూజా అన్ని రాష్ట్రాలకు లేఖలు రాశారు.
Telangana
Andhra Pradesh
AY.12
Corona Virus

More Telugu News