BJP: బెంగాల్‌లో బీజేపీకి ఎదురు దెబ్బ.. పార్టీ వీడిన మరో ఎమ్మెల్యే

Another MLA quits BJP to join TMC
  • తృణమూల్ గూటికి నాలుగో ఎమ్మెల్యే
  • మళ్లీ తృణమూల్ కండువా కప్పుకున్న సోమెన్ రాయ్
  • కొన్ని కారణాల వల్ల బీజేపీ టికెట్‌పై పోటీ చేసినట్లు వెల్లడి
  • మనసు, ఆత్మ టీఎంసీవే అని ప్రకటన
పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి మళ్లీ ఎదురు దెబ్బ తగిలింది. ఈ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే తృణమూల్ కాంగ్రెస్‌(టీఎంసీ)లో చేరారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇలా కాషాయ పార్టీ నుంచి బయటకు వచ్చి తృణమూల్ కండువా కప్పుకున్న నాలుగో ఎమ్మెల్యే ఈయన. కలియాగంజ్ నియోజక వర్గ ఎమ్మెల్యే సోమెన్ రాయ్ తాజాగా తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు.

అసెంబ్లీ ఎన్నికల ముందు టీఎంసీని వీడిన ఆయన బీజేపీలో చేరారు. మళ్లీ ఇప్పుడు సొంత గూటికి చేరారు. టీఎంసీ కీలక నేత పార్థ ఛటర్జీ సమక్షంలో పార్టీలో చేరిన అనంతరం సోమెన్ రాయ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కొన్ని కారణాల వల్ల బీజేపీ టికెట్‌పై కలియాగంజ్ నుంచి పోటీ చేశా. కానీ నా మనసు, ఆత్మ టీఎంసీకే సొంతం. సీఎం మమత కృషికి మద్దతు తెలిపేందుకే మళ్లీ పార్టీలో చేరా’’ అని ప్రకటించారు.

కొన్ని రోజుల క్రితమే బీజేపీ ఎమ్మెల్యే బిస్వజిత్ దాస్, అదే పార్టీ కౌన్సిలర్ మనోతోష్ నాథ్.. కాషాయ పార్టీకి గుడ్‌బై చెప్పేసి టీఎంసీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. వీరేకాదు, బీజేపీ ఎమ్మెల్యే, జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్ కూడా జూన్ నెలలో టీఎంసీలో చేరారు. ఆయన నాలుగేళ్ల క్రితం టీఎంసీ నుంచే బీజేపీకి వెళ్లారు.
BJP
TMC
West Bengal
Mamata Banerjee

More Telugu News