Uttar Pradesh: యూపీలో అంతుబట్టని జ్వరాలు.. 32 మంది చిన్నారులు సహా 39 మంది మృతి

39 Including 32 Children Died Of Mysterious Fever in UP
  • ధ్రువీకరించిన సీఎం యోగి ఆదిత్యనాథ్
  • ఫిరోజాబాద్ జిల్లాలో 9 చోట్ల డెంగ్యూ లాంటి జ్వరం
  • ఈ నెల 18న తొలి కేసు నమోదు
  • పారిశుద్ధ్య కార్యక్రమాల్లేవని జనం మండిపాటు
  • మురుగు కాల్వలు ఉప్పొంగుతున్నాయని ఆగ్రహం
ఉత్తరప్రదేశ్ లో అంతుబట్టని జ్వరాలకు 39 మంది చనిపోయారు. అందులో 32 మంది చిన్నారులు, ఏడుగురు పెద్దవారున్నారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ధ్రువీకరించారు. ఫిరోజాబాద్ జిల్లాలో దాదాపు 9 చోట్ల డెంగ్యూ లాంటి అంతుబట్టని వైరల్ జ్వరాలతో జనాలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు.

చనిపోయిన వారి కుటుంబాలను ఆయన పరామర్శించారు. జిల్లా చిన్న పిల్లల ఆసుపత్రిని పరిశీలించారు. ‘‘ఫిరోజాబాద్ జిల్లా ఆసుపత్రిలో ఇలాంటి జ్వరాల కోసం ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశాం. కరోనాకూ ప్రత్యేక వార్డును సిద్ధం చేశాం’’ అని ఆయన చెప్పారు. అయితే, వారంతా డెంగ్యూతో చనిపోయారన్న వార్తలను కొట్టిపారేశారు. ఈ జ్వరాలపై కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ దర్యాప్తు చేస్తోందని చెప్పారు.

ఈ జ్వరాలపై అవగాహన లేకపోవడం వల్ల పేషెంట్లను స్థానిక ప్రైవేట్ ఆసుపత్రులకు తీసుకెళ్తున్నారని అన్నారు.  ఈ నెల 18న తొలి కేసును గుర్తించారన్నారు. మున్సిపల్ సిబ్బందిగానీ, ఆరోగ్య సిబ్బందిగానీ అసలు పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించట్లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. చాలా వరకు డ్రైనేజీలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయని, కనీస చర్యలు లేవని మండిపడ్డారు.
Uttar Pradesh
Mysterious Fever
Dengue
COVID19
Yogi Adityanath

More Telugu News