Prakasam District: ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం: గేదె కళేబరంపైకెక్కిన ఆటోను ఢీకొట్టిన టిప్పర్.. ఐదుగురి దుర్మరణం

5 dead in a road accident in prakasam district
  • రోడ్డుపై పడివున్న గేదె కళేబరంపైకి ఆటో
  • ఎదురుగా దూసుకొచ్చి ఢీకొట్టిన టిప్పర్
  • మరో ఇద్దరి పరిస్థితి విషమం 
  • ప్రమాద సమయంలో ఆటోలో 14 మంది
ప్రకాశం జిల్లాలో గత అర్ధరాత్రి జరిగిన ఊహించని ప్రమాదంలో ఐదుగురు మృత్యువాత పడ్డారు. రోడ్డుపై చనిపోయి పడి ఉన్న గేదె కళేబరాన్ని ప్రమాదవశాత్తు ఎక్కిన ఆటోను నియంత్రిస్తున్న క్రమంలో ఓ టిప్పర్ వచ్చి దానిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.

తుర్లపాడు మండలం రోలుగుంపాడు ఎస్టీ కాలనీ సమీపంలో ఒంగోలు-కర్నూలు రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరగడానికి ముందు ఓ టిప్పర్.. రోడ్డు దాటుతున్న గేదెను ఢీకొట్టడంతో అది అక్కడికక్కడే మృతి చెందింది. ఆ తర్వాత అదే రోడ్డుపై వచ్చిన ఆటో చనిపోయి పడివున్న గేదెను గమనించకపోవడంతో దానిపైకి ఎక్కింది. దీంతో ఆటో బోల్తాపడబోతుండగా డ్రైవర్ నియంత్రించే ప్రయత్నం చేశాడు.

అదే సమయంలో ఎదురుగా వేగంగా వచ్చిన టిప్పర్ దానిని ఢీకొనడంతో ఆటో నుజ్జయింది. అందులోని ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని మార్కాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతులను దర్శి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ప్రమాద సమయంలో ఆటోలో డ్రైవర్ వెంకటేశ్వరరెడ్డితో పాటు మరో 14 మంది ఉన్నారు. వీరందరూ కొత్తపల్లిలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరై వస్తుండగా ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Prakasam District
Road Accident
Dead
Auto

More Telugu News