South Mumbai: 2050 నాటికి దక్షిణ ముంబైలో అధికభాగం జలమయం!: ముంబై మున్సిపల్ కమిషనర్

 By 2050 most of South Mumbai will be inundated
  • నారిమన్ పాయింట్, కఫ్ పరేడ్‌లో 80 శాతం మాయం
  • వెల్లడించిన ముంబై మున్సిపల్ కమిషనర్ ఇక్బాల్ సింగ్ చాహల్
  • 2050 పెద్ద దూరంలో లేదన్న మున్సిపల్ కమిషనర్
  • సముద్ర జలాల్లో పెరుగుదలే కారణం
సముద్ర జలాలు పెరుగుతున్న నేపథ్యంలో భారతదేశ వాణిజ్య రాజధాని ముంబై ప్రమాదంలో పడింది. దక్షిణ ముంబైలో అధికభాగం ప్రాంతాలు 2050 నాటికి జలమయం అయిపోతాయట. ఈ విషయాన్ని ముంబై మున్సిపల్ కమిషనర్ ఇక్బాల్ సింగ్ చాహల్ స్వయంగా వెల్లడించారు.

ముంబైలోని ప్రముఖ బిజినెస్ డిస్ట్రిక్ట్ నారిమన్ పాయింట్, రాష్ట్ర సెక్రటేరియట్ మంత్రాలయ కూడా నీటిలో మునిగిపోతాయని ఆయన తెలిపారు. మహారాష్ట్ర పర్యావరణ, వాతావరణ శాఖ మంత్రి ఆదిత్య థాకరే చేతుల మీదుగా ముంబై క్లైమాటిక్ యాక్షన్ ప్లాన్ ప్రారంభోత్సవం జరిగింది.

ఈ సందర్భంగా ఇక్బాల్ మాట్లాడుతూ.. సంచలన విషయాలు వెల్లడించారు. వాతావరణ మార్పుల కారణంగా దక్షిణ ముంబైలోని ఏ, బీ, సీ, డీ వార్డుల్లో 70 శాతం నీటమునిగిపోతుందని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే పర్యావరణం మనకు హెచ్చరికలు చేస్తోందని, మనుషులు స్పందించకపోతే ప్రమాదం తప్పదని ఇక్బాల్ స్పష్టంచేశారు.

‘‘కఫ్ పరేడ్, నారిమన్ పాయింట్, మంత్రాలయాల్లో 80 శాతం ప్రాంతం జలమయమైపోతుంది. అంటే మాయమైపోతుందన్న మాట’’ అని ఆయన అన్నారు. ఇది ఎప్పుడో వందల ఏళ్ల తర్వాత జరిగే పరిణామం కాదని, కేవలం 25-30 సంవత్సరాల్లో జరిగే ప్రమాదమని చెప్పారు. 2050 పెద్ద దూరంలో లేదని అన్నారు.

దక్షిణాసియా దేశాల్లో వాతావరణ మార్పులపై ఒక పథకం ప్రకారం స్పందిస్తున్న నగరం ముంబై ఒక్కటేనని ఆయన చెప్పారు. 129 సంవత్సరాల తర్వాత నిసర్గ తుపాను ముంబైని వణికించిందని, ఆ తర్వాత 15 నెలల్లోనే మూడు తుపానులు వచ్చాయని ఇక్బాల్ చెప్పారు. ఆగస్టు 5న భీకర వర్షం కారణంగా 5 నుంచి 5.5 అడుగుల ఎత్తున నారిమన్ పాయింట్లో నీళ్లు చేరాయని చెప్పిన ఇక్బాల్.. ఆరోజు ఎటువంటి తుపాను హెచ్చరికలూ రాలేదని, కానీ అది తుపానేనని పేర్కొన్నారు.
South Mumbai

More Telugu News