Team India: మూడో టెస్టులో టీమిండియా ఘోరపరాజయం

Team India lost third test to England with a huge margin
  • ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో ఇంగ్లండ్ విజయం
  • ఐదు టెస్టుల సిరీస్ 1-1తో సమం
  • రెండో ఇన్నింగ్స్ లో 278 పరుగులకు ఆలౌటైన భారత్
  • వచ్చే నెల 2 నుంచి నాలుగో టెస్టు
హెడింగ్లే టెస్టులో నిన్న భారత్ ఆడిన తీరు చూసినవాళ్లు ఈ మ్యాచ్ లో మనవాళ్లు ఓడిపోతారని ఏమాత్రం ఊహించి ఉండరు. అది కూడా ఇన్నింగ్స్ తేడాతో చేతులెత్తేస్తారని అస్సలు భావించి ఉండరు. కానీ క్రికెట్ లో ఏదైనా సాధ్యమేనని కోహ్లీ సేన మరోసారి చాటింది! మూడో టెస్టులో ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చేతిలో చిత్తుగా ఓడింది. ఇంగ్లండ్ పేసర్ ఓల్లీ రాబిన్సన్ భారత్ ను హడలెత్తించాడు. 5 వికెట్లు తీసుకుని భారత్ ను దారుణంగా దెబ్బతీశాడు. అతడికే 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దక్కింది. క్రెగ్ ఒవెర్టన్ కు 3 వికెట్లు, ఆండర్సన్ కు 1, మొయిన్ అలీకి 1 వికెట్ దక్కాయి.

భారత్ ఈ ఉదయం 215/2 ఓవర్ నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించింది. నిన్నటి ఆటతీరునే కొనసాగిస్తారని భావించిన అభిమానులకు కొద్దిసేపట్లోనే ఆశాభంగం కలిగింది. కేవలం 63 పరుగుల తేడాతో మిగిలిన 8 వికెట్లు కోల్పోయిన భారత్... దిగ్భ్రాంతికర ఆటతీరుతో ఘోర పరాజయం చవిచూసింది. పుజారా, కోహ్లీ, రహానే, పంత్ ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. జడేజా (30) ధాటిగా ఆడినా అది కూడా కాసేపే అయింది. తన రెండో ఇన్నింగ్స్ ను టీమిండియా 278 పరుగుల వద్ద ముగించింది.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ తొలి ఇన్నింగ్స్ లో 78 పరుగులకే కుప్పకూలగా, ఇంగ్లండ్ 432 పరుగుల భారీ స్కోరు సాధించింది. తద్వారా 354 పరుగుల ఆధిక్యం సాధించింది. ఇంగ్లండ్ కెప్టెన్ రూట్ సెంచరీ సాధించి జట్టు భారీ స్కోరుకు బాటలు వేశాడు. అటు బౌలర్లు ఆండర్సన్, రాబిన్సన్, ఒవెర్టన్ కూడా సమష్టిగా సత్తా చాటి జట్టును గెలుపు దిశగా నడిపించారు.

ఈ భారీ విజయంతో ఇంగ్లండ్ ఐదు టెస్టుల సిరీస్ ను 1-1తో సమం చేసింది. ఇక, ఇరుజట్ల మధ్య నాలుగో టెస్టు సెప్టెంబరు 2 నుంచి లండన్ లోని కెన్నింగ్ టన్ ఓవల్ లో జరగనుంది.
Team India
England
Headingley
Third Test

More Telugu News