Bhadradri Kothagudem District: ఐదుగురు బాలికలపై లైంగికదాడి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యాయుడికి 21 ఏళ్ల జైలు శిక్ష

Teacher sentenced for 21 years for rape on girl students
  • పాఠాల పేరుతో స్కూలుకు రప్పించిన ఉపాధ్యాయుడు
  • ఐదుగురిపై అత్యాచారం
  • తీర్పు వెలువరించిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు
కరోనా కారణంగా పాఠశాలలు మూతపడినప్పటికీ క్లాసుల పేరుతో బాలికలను పాఠశాలకు రప్పించి అత్యాచారానికి పాల్పడిన ఉపాధ్యాయుడికి కోర్టు 21 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలోని ఓ ప్రాథమిక పాఠశాలలో దొడ్డా సునీల్‌కుమార్ (40) సెకండరీగ్రేడ్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు.

కరోనా నేపథ్యంలో గతేడాది పాఠశాలలు మూతపడినప్పటికీ సునీల్ కుమార్ మాత్రం కొందరు బాలికలను పాఠాల పేరుతో స్కూలుకు రప్పించేవాడు. ఈ క్రమంలో అతడు విద్యార్థినులపై అత్యాచారానికి తెగబడ్డాడు. బాధిత బాలికలు విషయాన్ని తమ తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు. గతేడాది డిసెంబరు 5న తల్లిదండ్రుల సాయంతో ఐదుగురు బాలికలు సునీల్‌కుమార్‌పై ఫిర్యాదు చేశారు. ఆ తర్వాతి రోజే పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

తాజాగా నిన్న ఈ కేసును విచారించిన కొత్తగూడెంలోని పోక్సో ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టు న్యాయమూర్తి మహ్మద్ అబ్దుల్ రఫీ నిందితుడు సునీల్ కుమార్‌ను దోషిగా తేల్చి శిక్ష విధించారు. 21 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ. 11 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.
Bhadradri Kothagudem District
Teacher
Girls
Rape

More Telugu News