Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి కోసం తిరుపతి నుంచి సైకిల్ యాత్ర

fan came on a bicycle from tirupati to hyderabad for megastar chiranjeevi
  • చిరుతోపాటు పవన్ కల్యాణ్‌ను కలిసిన అభిమాని
  • అలిపిరిలో బయలుదేరి 12 రోజుల తర్వాత హైదరాబాద్‌కు
  • మెగాస్టార్‌ పుట్టినరోజున శుభాకాంక్షలు చెప్పేందుకే ఈ ప్రయాణం
ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు పండగే. ఎందుకంటే ఆరోజు మెగాస్టార్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడం పరిపాటి. ఈ క్రమంలోనే చిరుకు బర్త్‌డే విషెస్ చెప్పడం కోసం ఒక అభిమాని ఏకంగా తిరుపతి నుంచి హైదరాబాద్‌కు సైకిల్ ప్రయాణం చేశాడు. ఆగస్టు 10న అలిపిరిలో ఈ సైకిల్ యాత్ర ప్రారంభించి.. చిరు జన్మదినమైన 22 నాటికి హైదరాబాద్ చేరుకున్నాడీ వీరాభిమాని. ఈ విషయం తెలిసిన మెగాస్టార్ కూడా ఆశ్చర్యపోయారు. అదే సమయంలో తన అభిమానులు ఇలాంటి సాహసాలు చేయొద్దని వారించారు.
 
‘‘బలుజుపల్లి గ్రామం నుంచి వచ్చిన నా అభిమాని ఎన్. ఈశ్వరయ్య.. తిరుపతిలోని అలిపిరి నుంచి సైకిల్‌పై ఇక్కడకు చేరుకున్నాడు. నాకు బర్త్‌డే విషెస్ చెప్పడం కోసమే అతను ఇలా రావడం ఆశ్చర్యం కలిగించింది. నా ఆరాధ్య దైవం ఆంజనేయ స్వామి మాల వేసుకొని వచ్చిన ఈశ్వరయ్య మాకు స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నాడు. చాలా సందర్భాల్లో చెప్పాను.. మాకు అభిమానుల ప్రేమ, ఆదరణ గొప్ప ఎనర్జీ. వాళ్ల ప్రేమ, ఆశీస్సుల వల్లే మేం బాగుంటాం. మేం కూడా వాళ్లతోపాటు, వారి కుటుంబాలు బాగుండాలని కోరుకుంటాం’’ అని చిరు అన్నారు.

తనకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను కూడా చూడాలని ఉందని ఈశ్వరయ్య చెప్పడంతో.. చిరు ఆ ఏర్పాట్లు కూడా చేశారు. దీంతో ఇద్దరు మెగా హీరోలను కలిసిన ఈశ్వరయ్య ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. పన్నెండు రోజుల సైకిల్ ప్రయాణంతో వచ్చిన అలసట.. ఒక్క రోజులో తీరిపోయిందంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నాడీ డై హార్డ్ ఫ్యాన్. 
Chiranjeevi
Pawan Kalyan
fan
Tirupati
Hyderabad
Telangana
Andhra Pradesh
Tollywood

More Telugu News