Jeevan Reddy: సీఎం కేసీఆర్ పై రేవంత్ మాట్లాడుతున్న తీరు పట్ల సోనియాకు లేఖలు రాశాం: జీవన్ రెడ్డి

Jeevan Reddy counters Revanth Reddy comments on CM KCR
  • రేవంత్ వర్సెస్ టీఆర్ఎస్
  • ఇటీవల సీఎం కేసీఆర్ కు రేవంత్ సవాల్
  • ఘాటుగా బదులిచ్చిన మల్లారెడ్డి
  • తాజాగా జీవన్ రెడ్డి ప్రెస్ మీట్
  • థర్డ్ క్లాస్ మాటలు మాట్లాడుతున్నాడని విమర్శలు
టీపీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక ఎంపీ రేవంత్ రెడ్డి దూకుడు పెంచి టీఆర్ఎస్ అధినాయకత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా సీఎం కేసీఆర్ ను, ఆయన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇటీవల సీఎం కేసీఆర్ దత్తత గ్రామాల్లో ఏం అభివృద్ధి జరిగిందో చూపిస్తే తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.

దీనిపై ఇప్పటికే మంత్రి మల్లారెడ్డి ఘాటైన పదజాలంతో జవాబివ్వగా, తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి స్పందించారు. సీఎం కేసీఆర్ పై రేవంత్ మాట్లాడుతున్న తీరును కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీల దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. వారిరువురికీ లేఖలు రాశామని వెల్లడించారు.

రేవంత్ రెడ్డి మాటలు థర్డ్ క్లాస్ మాటలని  జీవన్ రెడ్డి  అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరూ తనను పట్టించుకోవడంలేదన్న అసంతృప్తితో రేవంత్ ఈ విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. అధికారంలోకి రాలేమన్న సత్యాన్ని గ్రహించే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ఇకనైనా రేవంత్ తీరు మార్చుకోవాలని హితవు పలికారు.
Jeevan Reddy
Revanth Reddy
CM KCR
Sonia Gandhi
Rahul Gandhi
Congress

More Telugu News