Narayan Rane: మహారాష్ట్రను బెంగాల్ కానివ్వం: కేంద్ర మంత్రి నారాయణ్ రాణే

  • అరెస్టయిన 9 గంటల తర్వాత బెయిల్
  • సీఎం ఉద్ధవ్ థాకరే చెంప పగలగొడతానంటూ వ్యాఖ్యలు
  • తానేమీ తప్పుచేయలేదన్న కేంద్ర మంత్రి
Maharashtra is not Bengal Union Minister Narayan Rane

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే చెంప పగలగొట్టేవాడినంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి నారాయణ్ రాణేకు బెయిల్ దక్కింది. 9 గంటలపాటు పోలీసు కస్టడీలో ఉన్న తర్వాత ఆయనకు కోర్టు బెయిలు మంజూరు చేసింది. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. తానేమీ తప్పు చేయలేదని స్పష్టం చేశారు. మూడేళ్ల క్రితం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ఉద్దేశించి ఉద్ధవ్ చేసిన వ్యాఖ్యలను రాణే గుర్తు చేశారు. అప్పట్లో యోగిని చెప్పుతో కొడతానని ఉద్ధవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల మహారాష్ట్రలో జరిగిన ‘జన ఆశీర్వాద యాత్ర’లో ప్రసంగించిన రాణే.. స్వాతంత్య్రం ఏ సంవత్సరంలో వచ్చిందో ఉద్ధవ్ మర్చిపోయారని, ప్రసంగం మధ్యలో పక్కనున్న వారిని అడిగారని విమర్శించారు. తాను ఆ పక్కన ఉండుంటే ఉద్ధవ్ చెంప పగలగొట్టేవాడినని అన్నారు.

ఈ క్రమంలో ఆయనపై కేసు బుక్ చేసిన సోమేశ్వర్ పోలీసులు.. ఆయన్ను అరెస్టు చేశారు. అనంతరం కోర్టు ముందు హాజరు పరిచారు. అనంతరం కోర్టు బెయిలు మంజూరుచేసింది. ఈ సందర్భంగా మీడియాతో రాణే మాట్లాడుతూ.. కీలక ప్రతిపక్ష నేత అయిన మమతాబెనర్జీని కూడా టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేశారు. ‘‘మహారాష్ట్రను పశ్చిమ బెంగాల్‌లా కానివ్వం. థాకరే ప్రభుత్వం కొన్ని రోజులు మాత్రమే ఉండే అతిథి మాత్రమే’’ అని స్పష్టం చేశారు. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేబినెట్ విస్తరణలో భాగంగా.. రాణేకు కేంద్ర మంత్రి పదవి దక్కిన సంగతి తెలిసిందే.

More Telugu News