Rolls Royce: అమితాబ్ పేరిట ఉన్న రోల్స్ రాయిస్ కారును స్వాధీనం చేసుకున్న అధికారులు

Rolls Royce car registered in the name of Amitab seized in Bengaluru
  • బెంగళూరులో రవాణాశాఖ దాడులు
  • 7 లగ్జరీ కార్లు స్వాధీనం
  • వాటిలో ఒకటి రోల్స్ రాయిస్ ఫాంటమ్
  • గతంలోనే విక్రయించిన అమితాబ్
  • ఇప్పటికీ ఆయన పేరిటే రిజిస్ట్రేషన్
ప్రపంచంలో అత్యంత విలాసవంతమైన కార్లలో రోల్స్ రాయిస్ ముందువరుసలో ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా రోల్స్ రాయిస్ కార్లను పరిమిత సంఖ్యలోనే విక్రయిస్తుంటారు. తాజాగా, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ పేరిట ఉన్న రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారును బెంగళూరులో కర్ణాటక రవాణా శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక రవాణా శాఖ అధికారుల దాడుల్లో మొత్తం ఏడు లగ్జరీ కార్లను స్వాధీనం చేసుకోగా, వాటిలో ఒకటి బిగ్ బి అమితాబ్ పేరిట ఉండడం ఆశ్చర్యం కలిగించింది.

ఈ తెల్లరంగు రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారును అమితాబ్ కు 2007లో ఏకలవ్య చిత్రం సందర్భంగా దర్శకుడు విధు వినోద్ చోప్రా బహూకరించారు. అయితే, సీనియర్ బచ్చన్ ఈ కారును ఉమ్రా డెవలపర్స్ సంస్థ యజమాని యూసుఫ్ షరీఫ్ అలియాస్ డి బాబు అనే వ్యక్తికి విక్రయించారు. అయితే ఆ కారు రిజిస్ట్రేషన్ ఇప్పటికీ అమితాబ్ పేరిటే ఉంది.

కాగా, పన్నులు కట్టని, ఇన్స్యూరెన్స్ తదితర సరైన పత్రాలు లేని కారణంగానే తాము సదరు లగ్జరీ కార్లను స్వాధీనం చేసుకున్నామని కర్ణాటక రవాణా శాఖ వెల్లడించింది. ఈ ఏడు కార్లలో ఐదు పుదుచ్చేరిలో రిజిస్ట్రేషన్ కాగా, రెండు మహారాష్ట్రలో రిజిస్టర్ అయినట్టు గుర్తించారు. పుదుచ్చేరిలో పన్నులు చాలా తక్కువగా ఉంటాయన్న సంగతి తెలిసిందే.
Rolls Royce
Amitabh Bachchan
Seize
Bengaluru
Karnataka

More Telugu News