Pakistan: ఉగ్రవాదుల ముఠా గెలవడాన్ని పాక్ మెచ్చుకోవడం చూస్తుంటే ఏవగింపుగా వుంది: అమెరికా రిపబ్లికన్ నేత

Disgusting to see Pakistans actions US leader
  • తాలిబన్ల గెలుపులో పాకిస్థాన్ కీలక పాత్ర
  • ఆఫ్ఘన్‌లో హింసాత్మక పాలన
  • పాక్ సీక్రెట్ సర్వీస్ ప్రవర్తన దారుణం
  • అమెరికా రిపబ్లికన్ పార్టీ నేత స్టీవ్ చాబట్ విమర్శలు
దాయాది దేశం పాకిస్థాన్‌పై అమెరికాకు చెందిన రిపబ్లిక్ నేత స్టీవ్ చాబట్ మండిపడ్డారు. పాకిస్థాన్, దాని ఇంటెలిజన్స్ సర్వీస్ మద్దతుతోనే తాలిబన్లు రెచ్చిపోయారని, ఆఫ్ఘనిస్థాన్‌ను వాళ్లు ఆక్రమించుకోవడంలో పాక్ పాత్ర చాలా ఉందని ఆయన విమర్శించారు. మాటల్లో చెప్పలేని హింసను మిగిల్చే తాలిబన్ పాలన ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్‌లో కనిపిస్తోందన్న స్టీవ్.. ఇలా ఉగ్రవాదుల ముఠా గెలవడాన్ని పాకిస్థాన్ మెచ్చుకోవడం, పండగలా చేసుకోవడం చూస్తే ఏవగింపుగా ఉందని అన్నారు.

ఇండియా కాకస్ సంస్థ కో-ఛైర్మన్ అయిన స్టీవ్ చాబట్.. హిందూ పొలిటికల్ యాక్షన్ కమిటీతో వర్చువల్‌గా సంభాషించారు. ఈ క్రమంలోనే ఆఫ్ఘన్లను కాపాడటం కోసం భారత్ చేపట్టిన చర్యలను ఆయన మెచ్చుకున్నారు. అదే సమయంలో తాలిబన్లకు అండగా నిలబడిన పాకిస్థాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

పాక్‌లో కూడా మైనార్టీలపై మతపరమైన దారుణాలు జరుగుతున్నాయని స్టీవ్ అన్నారు. హిందూ బాలికలను కిడ్నాప్ చేయడం, వయసులో పెద్దవాళ్లయిన ముస్లింలకు వారినిచ్చి బలవంతంగా పెళ్లిళ్లు చేయడం, బలవంతపు మతమార్పిడులు వంటివి పాకిస్థాన్‌లో ఎక్కువగా జరుగుతున్నాయని ఆయన చెప్పారు.

ఇవి కేవలం వదంతులు కాదని, చాలా డాక్యుమెంటరీలు కూడా ఇలాంటి ఘోరమైన ఎన్నో కథల్ని మనకు తెలిసేలా చేశాయని ఆయన వివరించారు. అదే సమయంలో దేశంలోని (యూఎస్) హిందూ అమెరికన్లపై కనిపిస్తున్న వివక్ష సహించరానిదని అన్నారు. అమెరికాలో ఇలాంటి వివక్షకు తావులేదని, దీన్ని అంతం చేయడానికి మార్గాలు వెతకాల్సిన అవసరం ఉందని స్టీవ్ చాబట్ పేర్కొన్నారు.
Pakistan
USA

More Telugu News