Congress: కాంగ్రెస్‌కు మరో షాక్.. త్రిపురలో పార్టీ అధ్యక్షుడు రాజీనామా!

Another shock for Congress Party president resigns in Tripura
  • పార్టీని వీడిన పిజూష్ కాంతి బిస్వాస్
  • తృణమూల్ కాంగ్రెస్‌లో చేరతారని వినిపిస్తున్న వార్తలు
  • స్పందించిన సుస్మితా దేవ్
  • నోరు మెదపని టీఎంసీ వర్గాలు
శతాధిక వసంతాల పార్టీ కాంగ్రెస్‌కు గడ్డుకాలం నడుస్తోంది. సీనియర్ నేతలు వరుసగా పార్టీని వీడుతున్నారు. నిన్నగాక మొన్న సీనియర్ నేత సుస్మితా దేవ్ కాంగ్రెస్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఆలిండియా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా ఉన్న ఆమె.. హఠాత్తుగా పార్టీకి వీడ్కోలు పలుకుతున్నట్లు తెలుపుతూ సోనియాగాంధీకి లేఖ రాశారు. ఈ విషయం కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపింది. ఈ అలజడి సద్దుమణగక ముందే మరో సీనియర్ నేత, త్రిపురలో కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్న పిజూష్ కాంతి బిస్వాస్ కూడా పార్టీకి గుడ్ బై చెప్పేశారు.

‘‘త్రిపుర పీసీసీ తాత్కాలిక అధ్యక్షుడిగా నా హయాంలో సహకరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మద్దతుదారులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా. ఈ రోజు నేను అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నా. రాజకీయాల నుంచి కూడా విరమణ తీసుకుంటున్నా. కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీకి హృదయపూర్వక ధన్యవాదాలు’’ అని ఆయన ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్‌పై ఇటీవలే కాంగ్రెస్ పార్టీని వీడి తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో చేరిన సుస్మితా దేవ్ స్పందించారు. ‘‘మన హయాం కఠినంగా ఉంది. భవిష్యత్తుకు గుడ్ లక్’’ అని ఆమె అన్నారు. దీంతో బిస్వాస్ కూడా టీఎంసీ కండువా కప్పుకోబోతున్నారని ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై తృణమూల్ వర్గంకానీ, బిస్వాస్ కానీ స్పందించలేదు. ఈ పరిణామంపై స్పందించడానికి బీజేపీ వర్గాలు కూడా నిరాకరించాయి. ఇది కాంగ్రెస్ అంతర్గత వ్యవహారమని బీజేపీ నేతలు పేర్కొన్నారు.


Congress
Tripura
Pijush Kanti Biswas

More Telugu News