Chiranjeevi: ప్రకృతి మాతకు మనందరం మాటివ్వాలి: చిరంజీవి

Chiranjeevi calls for planting three saplings on his birthday
  • రేపు చిరంజీవి పుట్టినరోజు
  • అభిమానులకు మెగా సందేశం
  • ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటాలని పిలుపు
  • హర్షం వ్యక్తం చేసిన ఎంపీ సంతోష్ కుమార్
మెగాస్టార్ చిరంజీవి తనవంతు బాధ్యతగా సామాజిక చైతన్యం దిశగా కృషి చేస్తుంటారు. ఆలోచింపజేసే పోస్టులతో సోషల్ మీడియా ద్వారా అభిమానుల్లో అవగాహన కల్పిస్తుంటారు. రేపు (ఆగస్టు 22) తన పుట్టినరోజు నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణపై స్పందించారు. పర్యావరణాన్ని కాపాడుకుంటామని మనందరం ప్రకృతి మాతకు మాటివ్వాలని పిలుపునిచ్చారు. వాతావరణ మార్పులు, వాయు కాలుష్యంపై పోరాటంలో భాగంగా మొక్కలు నాటడం ద్వారా వృక్షసీమలను అభివృద్ధి చేయాలని సూచించారు.

"నా పుట్టినరోజు సందర్భంగా మూడు మొక్కలు నాటాలని నా అభిమానులందరినీ కోరుతున్నాను. ఆ విధంగా నాపై మీ ప్రేమను చాటుతారని భావిస్తున్నాను. అంతేకాదు, 'హరా హై తో భరా హై' హ్యాష్ ట్యాగ్ ను పెట్టి టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన 'గ్రీన్ ఇండియా చాలెంజ్' కు మద్దతు పలకండి" అని చిరంజీవి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

కాగా, చిరంజీవి సందేశం పట్ల ఎంపీ సంతోష్ కుమార్ స్పందించారు. చిరంజీవికి ముందస్తుగా పుట్టినరోజు శుభకాంక్షలు తెలియజేశారు. "సర్... మీ పుట్టినరోజు నాడు ఎంతో సరైన నిర్ణయం తీసుకున్నారు. మీ పిలుపుకు ఆశేష అభిమానగణం తరలివచ్చి భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపడతారని విశ్వసిస్తున్నాను. మీ సామాజిక స్పృహ దేశంలోని అన్ని చిత్ర పరిశ్రమల అభినందనలు అందుకుంటుంది. ప్రకృతి మరింత ప్రేమాస్పదంగా మారేందుకు మీ చర్య తోడ్పడుతుంది" అని సంతోష్ కుమార్ పేర్కొన్నారు.
Chiranjeevi
Saplings
Birthday
Fans
Green India Challenge
Santosh Kumar
TRS
Telangana
Tollywood

More Telugu News