Taliban: ఉగ్ర సామ్రాజ్యాలు ఎక్కువ కాలం మనలేవు: మోదీ

PM Modi Says Empires Of Terror Temporary At Somnath Event
  • ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమించిన తరుణంలో వ్యాఖ్యలు
  • సోమ్‌నాథ్ ఆలయంలో రూ.83 కోట్ల పనులకు వర్చువల్‌గా శంకుస్థాపన
  • భయంతో భక్తిని ఎప్పటికీ జయించలేరన్న ప్రధాని
విధ్వంసక శక్తులు, ఉగ్రవాదంతో సామ్రాజ్యాలు సృష్టించాలనుకునే ముఠాలు కొంతకాలం వరకూ అనుకున్నవి సాధించొచ్చు, కానీ వాళ్లు శాశ్వతంగా మానవాళిని అణిచివేయలేరు అని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శుక్రవారం నాడు గుజరాత్‌లోని ప్రఖ్యాత సోమ్‌నాథ్ ఆలయంలో ఆయన పలు ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఉగ్రమూకలు భయంతో కొంతకాలంపాటు ప్రపంచాన్ని శాసించినా, ఆ తర్వాత ఆ సామ్రాజ్యాలు కనుమరుగైపోతాయని, వాళ్లు మానవాళిని ఎక్కువ కాలం అణిచివేయలేరని చెప్పారు. ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న తరుణంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. అలాగే సోమ్‌నాథ్ ఆలయాన్ని ఎందరో ధ్వంసం చేయాలని అనుకున్నారని, వాళ్లు అలా ప్రయత్నించినా ప్రతిసారీ ఆలయం ఈ దాడులను తట్టుకొని నిలబడిందని తెలిపారు.

సోమ్‌నాథ్ ఆలయంలోని విగ్రహాలు ధ్వంసం చేశారని, ఆలయం ఉనికి లేకుండా చేయడానికి ప్రయత్నించారని చెప్పిన ప్రధాని.. ఇలాంటి దాడులు జరిగిన ప్రతిసారీ ఆలయం పూర్తి వైభవంతో మళ్లీ నిలబడిందని కితాబునిచ్చారు. నిజాన్ని అబద్ధాలు, భక్తిని భయం ఓడించలేవనే సందేశాన్ని ప్రపంచానికి ఈ ఆలయం ఇచ్చిందని మోదీ కొనియాడారు.

ఈ సమావేశంలో ఆలయానికి సంబంధించిన రూ.83 కోట్ల విలువైన ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేశారు. వీటిలో సోమ్‌నాథ్ ప్రొమెనేడ్, సోమ్‌నాథ్ ఎగ్జిబిషన్ సెంటర్, పార్వతీ దేవి దేవాలయం, పాత (జునా) సోమ్‌నాథ్ దేవాలయ ప్రాంగణ పునర్నిర్మాణం ప్రాజెక్టులున్నాయి. ఆలయం పునర్నిర్మాణంలో విశేష కృషి చేసిన సోమ్‌నాథ్ ట్రస్టు సభ్యులను, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి వారి కృషితోనే 2013లో అంతర్జాతీయ పర్యాటక రంగ పోటీతత్వ జాబితాలో 65వ స్థానంలో ఉన్న భారత్.. 2019లో 34వ స్థానానికి చేరిందని మెచ్చుకున్నారు.
Taliban
Narendra Modi
Somnath
BJP
India
Afghanistan

More Telugu News