CBI: సీబీఐ పరిస్థితి పంజరంలో రామ చిలుకలా ఉంది.. వెంటనే దానిని విడుదల చేయండి..: మద్రాస్​ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

Free Caged Parrot CBI Madras High Court Orders Center
  • ఈసీ, కాగ్ లా స్వతంత్ర సంస్థగా మార్చండి
  • నేరుగా ప్రధానికే రిపోర్ట్ చేసేలా చర్యలు తీసుకోండి
  • దానికోసం ఓ చట్టాన్ని చేయండి
  • ఎఫ్ బీఐలా సీబీఐని మార్చండి
  • కేంద్రానికి హైకోర్టు ఆదేశాలు
సీబీఐపై మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. పంజరంలో రామచిలుకలా సీబీఐ మారిపోయిందని, వెంటనే దానిని విడుదల చేయాలని ఆదేశించింది. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేతుల్లో సీబీఐ కీలుబొమ్మలా మారిందంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయని పేర్కొంది. ఎన్నికల సంఘం, కంప్ర్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) మాదిరిగానే సీబీఐ కూడా స్వతంత్ర సంస్థలా ఉండాలని, అది కేవలం పార్లమెంట్ కే రిపోర్ట్ చేయాలని సూచించింది.

తమిళనాడులో జరిగిన 'పోంజీ' స్కామ్ పై సీబీఐ దర్యాప్తు జరిపించాల్సిందిగా కోరుతూ దాఖలైన పిటిషన్ పై జస్టిస్ ఎన్. కిరుబాకరన్, జస్టిస్ బి. పుగళెందిల ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగానే ఆ వ్యాఖ్యలు చేసింది. సీబీఐ వ్యవస్థలో మార్పులకు కోర్టు 12 పాయింట్ల నిర్మాణాత్మక సూచనలను చేసింది. సీబీఐకి చట్టబద్ధ హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ‘‘వీలైనంత త్వరగా సీబీఐ అధికారాలు, పరిధులు పెంచి.. సంస్థకు చట్టబద్ధ హోదా ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం ఓ చట్టాన్ని చేయాలి. సీబీఐపై ప్రభుత్వ పెత్తనం లేకుండా చూడాలి’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

డీవోపీటీకి కాకుండా నేరుగా ప్రధాన మంత్రి లేదా మంత్రికే రిపోర్ట్ చేసేలా కార్యదర్శి స్థాయి హోదాను సీబీఐ డైరెక్టర్ కు ఇవ్వాలని ఆదేశించింది. ఎక్కువ మంది సిబ్బంది లేరని పోంజీ స్కామ్ కేసును బదిలీ చేసేందుకు కేంద్రం నిరాకరించడంతో.. సంస్థలో వెంటనే కేడర్ సామర్థ్యాన్ని పెంచాల్సిందిగా కేంద్రాన్ని హైకోర్టు ఆదేశించింది. నెలలోపు నియామకాలు చేపట్టాలని సూచించింది. అమెరికా ఎఫ్ బీఐ, బ్రిటన్ స్కాట్లాండ్ యార్డ్ లాగా సీబీఐని బలోపేతం చేయాలని, అందుకు ప్రత్యేక బడ్జెట్ ను కేటాయించాలని కేంద్రానికి ఆదేశాలిచ్చింది.
CBI
Tamilnadu
High Court
Madras
Union Government
Prime Minister
Parliament

More Telugu News