Chandrayaan-2: జాబిల్లిపై నీటి జాడ కనుగొన్న చంద్రయాన్-2 ఆర్బిటర్

Chandrayaan orbiter finds water molecules on Moon surface
  • గతంలో చంద్రయాన్-2 విఫలం
  • నిలిచిపోయిన విక్రమ్ ల్యాండర్
  • ఇప్పటికీ కక్ష్యలో పరిభ్రమిస్తున్న ఆర్బిటర్
  • కీలక సమాచారం భూమికి చేరవేత
రెండేళ్ల కిందట చంద్రుడికి మరోవైపున పరిశోధనలు చేపట్టేందుకు ఉద్దేశించిన చంద్రయాన్-2 విఫలమైంది. విక్రమ్ ల్యాండర్ సాఫీగా దిగలేక చంద్రుడి ఉపరితలాన్ని బలంగా గుద్దుకుని నిలిచిపోయింది. అయితే, ఆశించిన లక్ష్యాన్ని నెరవేర్చడంలో విక్రమ్ ల్యాండర్ నిరాశపర్చినా, ఇప్పటికీ కక్ష్యలో పరిభ్రమిస్తూనే ఉన్న చంద్రయాన్-2 ఆర్బిటర్ అద్భుతమైన సమాచారాన్ని ఇస్రో శాస్త్రవేత్తలకు చేరవేసింది. చందమామ ఉపరితలంపై నీటి జాడను ఈ ఆర్బిటర్ గుర్తించింది.

చంద్రయాన్-2 ఆర్బిటర్ లో 8 కీలక శాస్త్రసాంకేతిక పరిశోధన పరికరాలు ఉన్నాయి. వీటి సాయంతో జాబిల్లి ఉపరితలంపై హైడ్రాక్సిల్, నీటి అణువులను కనుగొంది. ఇమేజింగ్ ఇన్ ఫ్రారెడ్ స్పెక్ట్రోమీటర్ సాయంతో ఆర్బిటర్ ఈ సమాచారాన్ని సేకరించింది. భారత అంతరిక్ష పరిశోధకులు ఈ డేటాను విశ్లేషించి, చంద్రుడిపై ఖనిజ లవణాల సమ్మేళనాన్ని అవగాహన చేసుకునేందుకు ప్రయత్నించనున్నారు.

ఆర్బిటర్ పంపిన ప్రాథమిక సమాచారం మేరకు చంద్రుడిపై విస్తృత స్థాయిలో తేమ ఉనికిని స్పష్టంగా వెల్లడిస్తోందని పరిశోధకులు తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలు ఇటీవల కరెంట్ సైన్స్ జర్నల్ లో ప్రచురితం అయ్యాయి. మరిన్ని అంతరిక్ష పరిశోధనలకు ఇది నాందిగా నిలుస్తుందని భారత పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేశారు.
Chandrayaan-2
Orbiter
Water
Moon
ISRO
India

More Telugu News