Team New Zealand: న్యూజిలాండ్ క్రికెటర్, మాజీ స్టార్ ఆల్ రౌండర్ క్రిస్ కెయిర్న్స్ పరిస్థితి విషమం
- చీలిపోయిన గుండె ధమని
- మార్చాలంటున్న వైద్యులు
- వెంటిలేటర్ పై చికిత్స
- ఆస్తులన్నీ కోల్పోయిన కెయిర్న్స్
- క్రికెటర్ నుంచి ట్రక్ డ్రైవర్ గా మారిన వైనం
న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, స్టార్ ఆల్ రౌండర్ క్రిస్ కెయిర్న్స్ ఆరోగ్యం విషమించింది. గత వారం ఆయన గుండెపోటుకు గురయ్యారు. తాజాగా అది మరింత విషమించింది. గుండె నుంచి శరీరానికి రక్తాన్ని సరఫరా చేసే ధమనిలో చీలిక వచ్చింది. దీంతో ఆయన్ను ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉన్న సెయింట్ విన్సెంట్ ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉంచి చికిత్స చేస్తున్నట్టు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. కెయిర్న్స్ పరిస్థితి విషమంగానే ఉన్నా చికిత్సకు స్పందిస్తున్నారని చెప్పారు. గుండె మార్పిడి చేయబోతున్నట్టు వివరించారు. ప్రస్తుతం దాత కోసం చూస్తున్నామన్నారు.
కాగా, ఆయనకు ఏమవుతుందోనన్న భయం వెంటాడుతోందని కెయిర్న్స్ భార్య మెలానీ చెప్పారు. కాన్ బెర్రాలో ఉండగానే అతడి గుండెకు అతిపెద్ద సమస్య వచ్చిందని చెప్పారు. దీంతో కాన్ బెర్రా, సిడ్నీల్లో శస్త్రచికిత్సలు చేశారన్నారు. న్యూజిలాండ్ క్రికెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ వైట్.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. తమ జట్టులోని మేటి ఆల్ రౌండర్లలో క్రిస్ కెయిర్న్స్ ఎప్పటికీ ఉంటారని చెప్పారు.
క్రిస్ కెయిర్న్స్ 215 వన్డేలు, 62 టెస్టులు ఆడారు. టెస్టుల్లో 33.53 సగటుతో 3,320 పరుగులు చేసి.. 218 వికెట్లు పడగొట్టాడు. వన్డేలో 4,950 పరుగులు చేసి.. 201 వికెట్లు తీశాడు. నిజానికి ఒక్క క్రికెట్టే కాదు.. వర్చువల్ స్పోర్ట్స్ సంస్థను ఆయన నడిపారు. దుబాయ్ లో వజ్రాల వ్యాపారిగా మారారు. కానీ, ఒక్కసారిగా ఆయన ఆర్థిక పరిస్థితి తలకిందులైంది. ఉన్నవన్నీ ఊడ్చుకుపోవడంతో, బతుకు బండిని నడిపించేందుకు గంటకు 17 డాలర్ల జీతానికి ఓ ట్రక్ డ్రైవర్ గా మారాల్సి వచ్చింది.