Dubai: కేవలం ముగ్గురు ప్రయాణికులతోనే హైదరాబాద్ నుంచి షార్జాకు వెళ్లిన విమానం

Flight from Hyderabad to Sharjah went with only 3 passengers
  • ఏప్రిల్ 18న దుబాయ్ నుంచి వచ్చిన కుటుంబం
  • కరోనా కేసులు పెరిగిపోవడంతో ఇక్కడే చిక్కుకుపోయిన వైనం
  • యూఏఈ నుంచి అనుమతి రావడంతో దుబాయ్ కు పయనం
ఎవరికీ లభించని అద్భుతమైన అవకాశం ఓ కుటుంబానికి లభించింది. 180 మంది ప్రయాణించడానికి వీలుండే విమానంలో ముగ్గురు సభ్యులతో కూడిన కుటుంబం మాత్రమే ప్రయాణించింది. విమానంలో వీరు ముగ్గురు తప్ప ఇతర ప్రయాణికులు ఎవరూ లేకపోవడం విశేషం. వివరాల్లోకి వెళ్తే, కరీంనగర్ కు చెందిన శ్రీనివాసరెడ్డి, హరితరెడ్డి దంపతులు గత పదేళ్లుగా దుబాయ్ లో నివాసం ఉంటున్నారు. హరితరెడ్డి దుబాయ్ లో డాక్టర్ గా పని చేస్తుండగా... శ్రీనివాసరెడ్డి టెక్ మహీంద్రాలో ఉద్యోగం చేస్తున్నారు.  

ఏప్రిల్ 18న హరితరెడ్డి తండ్రి సత్యనారాయణరెడ్డి మృతి చెందడంతో... వారిద్దరూ తమ కొడుకు సంజిత్ రెడ్డితో కలిసి అదే రోజున ఇండియాకు వచ్చారు. ఆ తర్వాత ఇండియాలో కరోనా కేసులు పెరిగిపోవడంతో... భారత విమానాలపై యూఏఈ నిషేధం విధించింది. దీంతో వీరు ఇక్కడే ఉండిపోయారు.

మధ్యలో ఆరుసార్లు విమాన టికెట్లను కొన్నప్పటికీ... నిబంధనలు మారుతుండటంతో వారి ప్రయాణం వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, గోల్డెన్ వీసా ఉన్న వారు రావచ్చని యూఏఈ ప్రభుత్వం ప్రకటించడంతో... వీరిద్దరూ దుబాయ్ కు తిరిగొచ్చేందుకు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి యూఏఈ ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో దుబాయ్ కు పయనమయ్యారు.

అయితే, విమానంలో ఇతర ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో... వీరు ముగ్గురితోనే విమానం బయల్దేరింది. హైదరాబాద్ నుంచి బయల్దేరిన ఎయిర్ బస్ ఏ-320 ఎయిర్ అరేబియా విమానం హైదరాబాద్ నుంచి షార్జాకు చేరుకుంది. వీరి ప్రయాణానికి సంబంధించి ఫొటో, వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
Dubai
UAE
Flight
Family
3 Passengers

More Telugu News