RS Praveen Kumar: బీజేపీ కుట్రలో ప్రవీణ్ కుమార్ భాగస్వామి: విరుచుకుపడిన టీఆర్ఎస్

TRS fires on BSP Leader RS Praveen Kumar
  • ప్రాంతీయ పార్టీలను విచ్ఛిన్నం చేస్తున్న బీజేపీ చేతిలో ప్రవీణ్ పావుగా మారారు
  • జాతి కోసం వీఆర్ఎస్ తీసుకున్నట్టు కొత్త డ్రామాలు
  • ఏనుగు ఎక్కే నల్గొండ సభకు వెళ్లారా?
  • అప్పుడు ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రయత్నించి ఇప్పుడు ఉద్యమాలు చేస్తారట!
బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై టీఆర్ఎస్ విరుచుకుపడింది. బీజేపీపైనా తీవ్ర విమర్శలు చేసింది. నిన్న టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, సైదిరెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, భాస్కర్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీపై నిప్పులు చెరిగారు.

దేశంలోని ప్రాంతీయ పార్టీలను విచ్ఛిన్నం చేయడమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తోందన్నారు. ఆ కుట్రలో ప్రవీణ్ కుమార్ భాగస్వామ్యం కావడం బాధాకరమన్నారు. కేంద్రం తనను ఉద్యోగం నుంచి ఎక్కడ తొలగిస్తుందోనన్న భయంతోనే ఆయన తన పదవికి రాజీనామా చేసి, ఆ పార్టీ చేతిలో పావుగా మారారని ఆరోపించారు. అభివృద్ధి కార్యక్రమాల ఊసేలేని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని పల్లెత్తు మాటనని ప్రవీణ్ కుమార్.. అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న టీఆర్ఎస్‌పై విమర్శలు చేస్తుండడం ఆయన నిజ స్వరూపాన్ని బయటపెడుతోందన్నారు.

తెలంగాణలో ఉద్యమాన్ని అణచివేసిన ప్రవీణ్ కుమార్ ఇప్పుడు ఉద్యమాలు చేస్తానని చెప్పడం సిగ్గుచేటన్నారు. గురుకులాల్లో ఫొటోలు పెట్టుకుని క్షీరాభిషేకాలు చేయించుకున్న ఆయన ఇప్పుడు కొత్త నాటకాలు మొదలుపెట్టారని ధ్వజమెత్తారు. కేసీఆర్ ఆయనను ఎంతగానో ప్రోత్సహించారని అన్నారు.

 వీఆర్ఎస్ తీసుకుని జాతి కోసం బయటకు వచ్చినట్టు అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. బీఎస్పీలో ఆయన చేరిక ఓ నాటకమని, బీజేపీ చేతిలో ప్రవీణ్ కుమార్ పావు అని అన్నారు. దళితబంధు లాంటి పథకాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో, దాని వెనక ఉన్నదెవరో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏనుగు ఎక్కి ప్రగతి భవన్‌కు వెళ్తానన్న ప్రవీణ్ కుమార్ నల్గొండ సభకు కూడా అలాగే వెళ్లారా? అని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎద్దేవా చేశారు.
RS Praveen Kumar
BJP
BSP
TRS
Telangana

More Telugu News