BYJUs: తప్పుడు సిలబస్ ఇచ్చారంటూ బైజూస్​ రవీంద్రన్​ పై క్రిమినల్​ కేసు

Police Filed Criminal Case Against BYJUs Ravindran
  • యూపీఎస్సీ సిలబస్ ను తప్పుగా చెప్పారని ఫిర్యాదు
  • తప్పుడు సమాచారమిచ్చారన్న క్రిమియోఫోబియా
  • కేంద్ర ప్రభుత్వం, 45 శాఖలపై సుప్రీంకోర్టులో పిటిషన్
ఆన్ లైన్ విద్య యాప్ బైజూస్ యజమాని రవీంద్రన్ పై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. యూపీఎస్సీ కోర్సు కోచింగ్ లో తప్పుడు సిలబస్ ను పెట్టారన్న ఫిర్యాదుపై ఐటీ చట్టంలోని నేరపూరిత కుట్ర కింద క్రిమినల్ కేసును నమోదు చేశారు.

క్రిమియోఫోబియా అనే సైన్స్ సంస్థ ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు పెట్టారు. ఐక్యరాజ్యసమితిలోని అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరాల (యూఎన్టీవోసీ) విభాగానికి భారత దర్యాప్తు సంస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) నోడ్ ఏజెన్సీగా బైజూస్ పాఠంలో చెప్పారని పేర్కొంది. అయితే, తాను యూఎన్ టీవోసీకి నోడల్ ఏజెన్సీ కాదని లిఖితపూర్వకంగా సీబీఐ వెల్లడించిందని గుర్తు చేసింది.

దీనిపై బైజూస్ ను వివరణ కోరగా.. సీబీఐని నోడల్ ఏజెన్సీగా పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం పేర్కొందన్న లేఖను తనకు పంపారని క్రిమియోఫోబియా యజమాని స్నేహిల్ ధల్ తెలిపారు. అయితే, ఆ లేఖ 2012 నాటిదని ఆయన చెప్పారు. తాము నోడల్ ఏజెన్సీ కాదని 2016లోనే సీబీఐ రాతపూర్వకంగా సమాధానమిచ్చిందని ఆయన గుర్తు చేశారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. ఇక, యూఎన్టీవోసీని అమలు చేయనందుకు కేంద్ర ప్రభుత్వం, 45 శాఖలపైనా ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. కాగా, ఈ వ్యవహారంపై తమకింకా ఎఫ్ ఐఆర్ కాపీ అందలేదని, ఇప్పుడే ఏమీ మాట్లాడలేమని బైజూస్ ప్రతినిధి తెలిపారు.
BYJUs
Ravindran
UPSC
CrimeoPhobia

More Telugu News