Rajasthan: ఊహించని ప్రమాదం.. ఓ వ్యక్తి ముఖమే మారిపోయింది!

Rajasthan Man Gets New Face After Raging Bull Attacks Him
  • కుడివైపు భాగాన్ని కొమ్ముతో చీల్చేసిన ఎద్దు
  • శస్త్రచికిత్సలతో కొత్త రూపునిచ్చిన వైద్యులు
  • త్వరలోనే కృత్రిమ కన్నును పెట్టనున్న నిపుణులు
కొన్ని ఊహించని ఘటనలు, ప్రమాదాలు మనిషి జీవితాన్ని అమాంతం మార్చేస్తాయి. రాజస్థాన్ లోని బికనీర్ కు చెందిన కర్ణీ బిష్ణోయ్ అనే 38 ఏళ్ల వ్యక్తి జీవితమూ అలాగే మారిపోయింది. అందమైన అతడి ముఖమే పూర్తిగా మారింది. అసలేం జరిగిందంటే..

గత ఏడాది సెప్టెంబర్ లో ఆఫీసు నుంచి ఇంటికి వెళ్తున్న బిష్ణోయ్ పై ఓ ఎద్దు దాడి చేసింది. కొట్లాడుకుంటున్న ఎద్దులు వెళ్లిపోయేంత వరకు ఆగుదామనుకున్న బిష్ణోయ్.. కారును ఆపాడు. కిటికీ అద్దం తీశాడు. అంతే, ఆ ఎద్దుల్లో ఒకటి కొమ్ముతో బిష్ణోయ్ మొహంపై కుమ్మేసింది. కుడి కన్ను, ముక్కు, నోటిని చీల్చేసింది. కారు నుంచి విసిరి అవతలకు పారేసింది. తీవ్రగాయాలైన బిష్ణోయ్ ను వెంటనే పక్కనే ఉన్న సహోద్యోగి బికనీర్ లోని స్థానిక ఆసుపత్రికి తరలించారు.


అయితే, వారు కొన్ని కుట్లు వేసి, అంతకు మించి తామేమీ చేయలేమని చేతులెత్తేశారు. దీంతో సాకేత్ లోని మ్యాక్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతడిని పరిశీలించిన వైద్యులు కంగు తిన్నారు. వెంటనే న్యూరో, ప్లాస్టిక్ సర్జన్లను పిలిపించారు. కరోనా నిబంధనలను పాటిస్తూ దాదాపు 10 గంటల పాటు శస్త్రచికిత్స చేసి మొహంలో విరిగిపోయిన ఎముకలు, కండ, ముక్కు భాగాలను అతికించారు. మామూలు మనిషి ముఖంలా మార్చారు.

అయితే, అతడి కుడివైపు ఎలాంటి కదలికలు లేకపోవడంతో నాలుగు నెలల తర్వాత మరో శస్త్రచికిత్స చేశారు. కండరాల మధ్య నాడీకణాల పనితీరును మెరుగుపరిచేందుకు ఆపరేషన్ చేశారు. దీంతో మామూలుగానే అతడి కుడివైపు ముఖంలో కదలికలు మొదలయ్యాయి. మున్ముందు మరికొన్ని శస్త్రచికిత్సలు చేయాల్సిన అవసరం ఉందని, కృత్రిమ కన్నును పెట్టాల్సి ఉందని, ముఖంపై మచ్చలను తొలగించాల్సి ఉందని వైద్యులు తెలిపారు.

Rajasthan
Bull Attack
Face Surgery

More Telugu News