No Kissing Zone: 'ముద్దుమురిపాలు ఇక్కడొద్దమ్మా'.. ప్రేమజంటల సందడితో విసుగెత్తిన కాలనీవాసుల 'రాత'పూర్వక హెచ్చరిక!

No kissing zone Housing society in Mumbai marks area to discourage public displays of affection
  • ముంబైలోని బోరీవలి ప్రాంతంలో ఘటన
  • సాయంత్రం ఐదు కాగానే అక్కడికి చేరి ముద్దుముచ్చట్లలో మునిగిపోతున్న జంటలు
  • పోలీసులు పట్టించుకోకపోవడంతో స్థానికుల పరిష్కారం
కరోనా కారణంగా పార్కులు మూతపడడం, సముద్రం ఒడ్డున కాసేపు సేద తీరే అవకాశం లేకపోవడంతో ముంబైలోని జంటలకు పెద్ద కష్టం వచ్చిపడింది. ఏకాంతంగా గడిపేందుకు సరైన చోటు లేక అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో, తమ ముద్దుమురిపాలకు తగిన చోటు లేకపోవడంతో ఓ కొత్త చోటును వెతుక్కున్నారు.

నగరంలోని బోరీవలీలో సత్యం, శివం, సుందరం సొసైటీ ఎదురుగా ఉన్న రహదారి వారికి చక్కని మార్గంగా కనిపించింది. సాయంత్రం ఐదు గంటలు కాగానే బైక్‌లు, కార్లలో అక్కడికి చేరుకుంటున్న జంటలు చీకటి పడేవరకు అక్కడే గడుపుతూ, ముద్దుముచ్చట్లలో తేలియాడడం మొదలెట్టారు.

అయితే, వీరి హంగామాతో ఎదురుగా ఉన్న ఇళ్లలోని వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరి ముద్దుముచ్చట్ల దృశ్యాలను కొందరు అపార్ట్‌మెంట్ వాసులు ఫోన్లలో చిత్రీకరించి స్థానిక కార్పొరేటర్‌కు చూపించారు. అయన సలహాతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, వారు పట్టించుకోకపోవడంతో స్థానికులే రంగంలోకి దిగారు.

‘నో కిస్సింగ్ జోన్’ అని రోడ్డుపై రాయించారు. ఈ ఐడియా చక్కని ఫలితాన్నే ఇచ్చింది. ఇలా రాసిన తర్వాత అక్కడికి వచ్చే జంటల సంఖ్య తగ్గడంతో సత్యం, శివం, సుందరం కాలనీవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
No Kissing Zone
Mumbai
Lovers

More Telugu News