Tokyo: ఒక్క ఒలింపిక్స్​ లో 7 పతకాలు.. మొట్టమొదటి అథ్లెట్​ గా చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా స్విమ్మర్​

Australia Swimmer Wins 7 Medals in One Olympics Create History
  • ఒక్క ఒలింపిక్స్ లో ఎక్కువ పతకాలు సాధించిన అథ్లెట్ గా ఎమ్మా మెకియాన్
  • పూర్వపు రికార్డును తుడిచిపెట్టిన వైనం
  • ఖాతాలో 4 స్వర్ణాలు, 3 కాంస్యాలు
  • రెండు ఒలింపిక్స్ లో 11 పతకాలు
ఒలింపిక్స్ లో పతకం సాధించాలని ఏ అథ్లెట్ కు మాత్రం ఉండదూ! ప్రతి ఒక్కరి కల అది. ఒక అథ్లెట్ ఒక పతకం సాధిస్తేనే దేశం మొత్తం ఊగిపోతుంది. అలాంటిది ఒక అథ్లెట్ ఒక్క ఒలింపిక్స్ లోనే ఒకటి కన్నా ఎక్కువ పతకాలు సాధిస్తే.. ఆ ఉత్సాహం ఇంకెంత ఉండాలి? అవును, ఒక్క ఒలింపిక్స్ లోనే ఏడు పతకాలు నెగ్గి.. చరిత్ర సృష్టించింది ఆస్ట్రేలియా స్విమ్మర్ ఎమ్మా మెకియాన్. ఒక్క ఒలింపిక్స్ లో అత్యధిక పతకాలు గెలిచిన అథ్లెట్ గా రికార్డు నెలకొల్పింది.

ఆదివారం జరిగిన 4*100 మీటర్ల రిలేలో డిఫెండింగ్ చాంపియన్ అమెరికాను ఆస్ట్రేలియా టీమ్ ఓడించింది. ఎమ్మా మెకియాన్, కేలీ మమెక్ కీవోన్, చెల్సీ హాడ్జెస్, కేట్ క్యాంప్ బెల్ లు 3 నిమిషాల 51.6 క్షణాల్లో ఆ దూరాన్ని అందుకున్నారు. అమెరికా స్విమ్మర్లు 3 నిమిషాల 51.73 క్షణాలతో త్రుటిలో ఓడిపోయారు. కెనడా స్విమ్మర్లు 3 నిమిషాల 52.6 క్షణాల్లో ఈదారు.

దీంతో ఆస్ట్రేలియా రిలే టీమ్ కు గోల్డ్ దక్కింది. ఈ పతకంతో 27 ఏళ్ల  మెకియాన్ టోక్యో ఒలింపిక్స్ లో 7 పతకాలు సాధించినట్టయింది. నాలుగు స్వర్ణాలు, మూడు కాంస్య పతకాలను తన ఖాతాలో వేసుకుంది. 1952లో ఆరు పతకాలతో తూర్పు జర్మనీ అథ్లెట్ క్రిస్టిన్ ఓటో, 2008లో ఆమెను సమం చేసిన అమెరికా అథ్లెట్ నటాలీ కఫ్లిన్ రికార్డులను ఎమ్మా తుడిచిపెట్టేసింది. కాగా, రెండు ఒలింపిక్స్ లో కలిపి ఆమె 11 పతకాలు గెలిచిందని ఆస్ట్రేలియా ఒలింపిక్స్ కమిటీ వెల్లడించింది. 2016 ఒలింపిక్స్ లో ఒక స్వర్ణంతో పాటు 2 రజతాలు, ఒక కాంస్య పతకం గెలిచిందని పేర్కొంది.
Tokyo
Tokyo Olympics
Australia
Swimmer
Olympics
Emma McKeon

More Telugu News