Raja Singh: ఏ మొహం పెట్టుకుని హుజారాబాద్ ఓటర్లను కేసీఆర్ ఓట్లు అడుగుతారు?: రాజాసింగ్
- హైదరాబాద్ రోడ్లన్నీ అధ్వానంగా తయారయ్యాయి
- చిన్న వర్షం పడినా రోడ్లు మునిగిపోతున్నాయి
- హుజూరాబాద్ ఎన్నికల కోసమే కొత్త పథకాలు తెచ్చారు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోడ్లన్నీ అధ్వానంగా తయారయ్యాయని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మండిపడ్డారు. చిన్న వర్షం వచ్చినా రోడ్లను నీరు ముంచెత్తుతోందని అన్నారు. మ్యాన్ హోల్స్ లో పడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. హుజూరాబాద్ ఎన్నికల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త పథకాలను తెరపైకి తీసుకొచ్చారని... ఆయన ఏం చేసినా అక్కడ టీఆర్ఎస్ గెలిచే పరిస్థితే లేదని అన్నారు.
హైదరాబాద్ రోడ్లపై అయ్యాకొడుకులు (కేసీఆర్, కేటీఆర్) బైక్ మీద తిరిగితే వాస్తవ పరిస్థితి అర్థమవుతుందని రాజా సింగ్ దుయ్యబట్టారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ని అడిగితే డబ్బులు లేవని అంటున్నారని చెప్పారు. తామే నెలకు కోటి రూపాయల అప్పు చెల్లిస్తున్నామని ఆయన చెపుతున్నారని అన్నారు. బంగారు తెలంగాణ అని చెప్పుకుంటూ... చివరకు అప్పుల తెలంగాణ చేశారని కేసీఆర్ పై మండిపడ్డారు. ఏ మొహం పెట్టుకుని హుజారాబాద్ ఓటర్లను కేసీఆర్ ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. ఏమీ చేయకుండా ఓట్లు అడిగితే ప్రజలు తిప్పి కొడతారని అన్నారు.