Shilpa Shetty: బాంబే హైకోర్టులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టికి ఎదురుదెబ్బ.. మీడియా కథనాల్లో పరువు తీసే అంశాలేవీ లేవన్న న్యాయస్థానం

How Is This Defamation High Court On Shilpa Shettys Plea
  • మీడియాను నియంత్రించాలంటూ బాంబే హైకోర్టును ఆశ్రయించిన శిల్ప
  • ఆ కథనాలు మానవీయ కోణంలోనే ఉన్నాయన్న జస్టిస్ పటేల్ 
  • జర్నలిజంలో ఏది మంచో, ఏది చెడో నిర్ణయించలేమన్న కోర్టు
  • ప్రజా జీవితంలో ఇలాంటివి ఎదుర్కోవాల్సిందేనని స్పష్టీకరణ
  • సామాజిక మాధ్యమాలలో కథనాలను నియంత్రించాలని కోరడం ప్రమాదకరమన్న న్యాయస్థానం
పోర్న్ చిత్రాల కేసులో రాజ్‌కుంద్రా అరెస్ట్ అయిన తర్వాత తన పరువుకు నష్టం కలిగించేలా, ద్వేషపూరితంగా కథనాలు ప్రచారమయ్యాయని, ఈ విషయంలో మీడియాను నియంత్రించాలంటూ బాంబే హైకోర్టును ఆశ్రయించిన బాలీవుడ్ ప్రముఖ నటి, రాజ్‌కుంద్రా భార్య శిల్పాశెట్టికి ఎదురుదెబ్బ తగిలింది. మీడియా కథనాల ద్వారా తన ప్రతిష్ఠకు తీవ్ర భంగం వాటిల్లిందని, కాబట్టి రూ. 25 కోట్ల పరిహారాన్ని ఇప్పించాలని, తన పరువుకు భంగం కలిగేలా యూట్యూబ్, ఫేస్‌బుక్, గూగుల్‌లో వచ్చిన కథనాలను తొలగించేలా ఆదేశించాలంటూ వేసిన శిల్ప పిటిషన్‌ను కోర్టు నిన్న విచారించింది.

ఈ సందర్భంగా జస్టిస్ గౌతమ్ పటేల్ మాట్లాడుతూ.. జర్నలిజంలో మంచి, చెడు నిర్ణయించడంలో న్యాయస్థానాలది పరిమిత పాత్ర అని వ్యాఖ్యానించారు. శిల్పాశెట్టికి వ్యతిరేకంగా ప్రసారమైన మీడియా కథనాలలో ఆమె పరువుకు భంగం కలిగించే అంశాలేవీ లేవని పేర్కొన్నారు. అవన్నీ పోలీసుల కథనాల ఆధారంగానే ఉన్నాయని స్పష్టం చేశారు. శిల్పాశెట్టి ఏడ్చిందని, భర్తతో గొడవపడిందని మాత్రమే వాటిలో ఉందన్నారు. ఇంట్లో ఎవరూ లేనప్పుడు నాలుగు గోడల మధ్య ఈ ఘటన జరిగితే అది వేరే విషయం కానీ, బయటి వ్యక్తుల మధ్య జరిగిన విషయాలనే ఆ కథనాల్లో ప్రస్తావించారని, ఇదెలా పరువునష్టం అవుతుందని జస్టిస్ గౌతమ్ పటేల్ ప్రశ్నించారు.

ఇంకా చెప్పాలంటే శిల్పపై కథనాలు మానవీయ కోణంలోనే ఉన్నాయని, ఈ కథనాల్లో ఎలాంటి తప్పు కనిపించడం లేదన్నారు. ప్రజా దృష్టిలో ఉండే జీవితాన్ని ఎంచుకున్నప్పుడు ఇలాంటివి అందులో భాగం అవుతాయని, మీ జీవితం మైక్రోస్కోప్ కిందే ఉంటుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని జస్టిస్ పటేల్ సూచించారు. అంతేకాదు, సామాజిక మాధ్యమాల్లో వచ్చే కంటెంట్‌ను కూడా నియంత్రించాలని కోరడం ప్రమాదకరమని పేర్కొంది.

‘పీపింగ్ మూన్’ అనే వెబ్‌సైట్‌లో శిల్పాశెట్టిపై వచ్చిన కథనాలపై ఆమె న్యాయవాది బీరేంద్ర సరాఫ్ కోర్టు దృష్టికి తీసుకురాగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. అయితే, నిజానిజాలను నిర్ధారించుకోకుండా ద్వేషపూరిత కంటెంట్ తో అప్‌లోడ్ చేసిన వీడియోలను తొలగించాలంటూ మూడు యూట్యూబ్ చానళ్లను కోర్టు ఆదేశించింది.
Shilpa Shetty
Bollywood
Raj Kundra
Media
Bombay High Court
Porn Case

More Telugu News