Pfizer: ఫైజర్, ఆస్ట్రాజెనెకా టీకాలతో వచ్చే యాంటీబాడీలపై బ్రిటన్ అధ్యయనం.. సంచలన విషయాల వెల్లడి

Pfizer and AstraZeneca Vaccine Antibody Levels May Decline In 2 or 3 Months
  • రెండుమూడు నెలలకే క్షీణిస్తున్న యాంటీబాడీలు
  • వైద్య పత్రిక ‘లాన్సెట్’లో ప్రచురితమైన అధ్యయన వివరాలు
  • కొవిషీల్డ్‌తో 93 శాతం రక్షణ లభిస్తోందన్న మరో అధ్యయనం
ఫైజర్, ఆస్ట్రాజెనెకా టీకాలు వేసుకున్న వారిలో ఉత్పత్తి అయ్యే యాంటీబాడీలపై బ్రిటన్‌లోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ శాస్త్రవేత్తలు సంచలన విషయాన్ని వెల్లడించారు. ఈ రెండు టీకాలు వేసుకున్న వారిలో ఉత్పత్తి అయ్యే యాంటీబాడీలు ఆరు వారాల తర్వాత క్రమంగా క్షీణిస్తున్నట్టు వారి అధ్యయనంలో తేలింది. ఆస్ట్రాజెనెకాతో పోలిస్తే ఫైజర్ టీకా తీసుకున్న వారిలో యాంటీబాడీల స్థాయి చాలా ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. అయితే, ఆ తర్వాత మాత్రం క్రమంగా అవి క్షీణిస్తున్నట్టు గుర్తించారు. కరోనా నుంచి కోలుకున్న వారితో పోలిస్తే టీకా తీసుకున్న వారిలోనే ఎక్కువ యాంటీబాడీలు ఉత్పత్తి అయినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు.

పైన చెప్పిన టీకాలు రెండు డోసులు తీసుకున్న తర్వాత యాంటీబాడీల స్థాయి తొలుత బాగానే ఉన్నప్పటికీ రెండుమూడు నెలల తర్వాత గణనీయంగా పడిపోవడాన్ని గుర్తించినట్టు పరిశోధనలో పాల్గొన్న మధుమితా శ్రోత్రి తెలిపారు. ఈ అధ్యయన ఫలితాలు ‘లాన్సెట్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. మరోవైపు, భారత్‌లో ఇస్తున్న కొవిషీల్డ్ టీకాల వల్ల 93 శాతం రక్షణ లభిస్తున్నట్టు సైనిక దళాల వైద్య కళాశాల అధ్యయనం పేర్కొంది. ఈ వ్యాక్సిన్ మరణాల రేటును 98 శాతం వరకు తగ్గిస్తున్నట్టు వెల్లడైంది. కరోనా సెకండ్ వేవ్ సమయంలో 15 లక్షల మంది వైద్యులు, ఫ్రంట్ లైన్ వర్కర్లపై నిర్వహించిన ఈ అధ్యయనం వివరాలను కేంద్రం నిన్న విడుదల చేసింది.
Pfizer
Astrazeneca
Vaccine
Corona Virus
Antibodies

More Telugu News