Sherlyn Chopra: రాజ్ కుంద్రా కేసులో నటి షెర్లీన్ చోప్రాకు సమన్లు జారీ
- అశ్లీల చిత్రాల కేసులో అరెస్టయిన రాజ్ కుంద్రా
- కుంద్రాపై సాక్ష్యాధారాలు సేకరిస్తున్న పోలీసులు
- కుంద్రాపై బిగుస్తున్న ఉచ్చు
- విచారణకు రావాలని షెర్లీన్ కు ఆదేశాలు
అశ్లీల చిత్రాల వ్యవహారంలో నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాకు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాధారాలను సేకరించే పనిలో ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తలమునకలుగా ఉన్నారు. తాజాగా ఈ కేసుకు సంబంధించి నటి షెర్లీన్ చోప్రాకు పోలీసులు సమన్లు జారీ చేశారు. రేపు (మంగళవారం జులై 27) ఉదయం 11 గంటలకు తమ ఎదుట విచారణకు రావాలని ఆదేశించారు. రేపు షెర్లీన్ చోప్రాను ప్రశ్నించిన అనంతరం మరికొందరిని కూడా విచారణకు పిలవాలని పోలీసులు భావిస్తున్నారు. రాజ్ కుంద్రా అరెస్ట్ అయినప్పటి నుంచి ఈ వ్యవహారంలో షెర్లీన్ చోప్రా పేరు కూడా వినిపిస్తోంది.
కాగా, పోలీసులు రాజ్ కుంద్రాకు చెందిన వియాన్ ఇండస్ట్రీస్ ఉద్యోగుల నుంచి కీలక సమాచారాన్ని సేకరించారు. నలుగురు ఉద్యోగులు ఈ కేసులో సాక్షులుగా మారారు. ఈ కేసు నుంచి ఎలాగైనా బయటపడాలని భావిస్తున్న రాజ్ కుంద్రాకు ఈ పరిణామం తీవ్ర విఘాతం కలిగిస్తోంది.