Road Accident: నాగర్ కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... ఎనిమిది మంది మృతి

Fatal accident in Nagar Kurnool district
  • చెన్నారం గేట్ వద్ద రెండు కార్లు ఢీ
  • రోడ్డుపై ఎగిరిపడిన వ్యక్తులు
  • అక్కడికక్కడే మృతి
  • తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్
హైదరాబాద్-శ్రీశైలం రహదారి నెత్తురోడింది. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం చెన్నారం గేట్ వద్ద రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. అమితవేగంతో ప్రయాణిస్తున్న కార్లు ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది.

ఈ ఘటనలో రెండు కార్లు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. కార్లు బలంగా ఢీకొనడంతో వాటిలో ఉన్న వారు రోడ్డుపై ఎగిరిపడ్డారు. మృతదేహాలను పోలీసులు నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం వాటిని బంధువులకు అప్పగించనున్నారు. క్షతగాత్రులను అచ్చంపేట ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి దారితీసిందని పోలీసులు అంటున్నారు.

ఈ దుర్ఘటనపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే స్థానిక శాసనసభ్యుడు గువ్వల బాలరాజుకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. తగిన చర్యలు చేపట్టాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాగా, ఈ ప్రమాదంలో మరణించిన వారు హైదరాబాదులోని పలు ప్రాంతాలకు చెందిన వారుగా గుర్తించారు.
Road Accident
Nagarkurnool District
Chennaram Gate
Telangana

More Telugu News