Punjab: సిద్ధూ ప్రమాణ స్వీకారోత్సవానికి వెళుతుండగా ఘోర ప్రమాదం.. ముగ్గురు కాంగ్రెస్​ కార్యకర్తల మృతి

Road Accident in Punjab Claims 3 Lives as they were on their way to Sidhus Elevation Ceremony
  • ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన మినీ బస్సు
  • పంజాబ్ లోని లొహారా వద్ద ప్రమాదం
  • దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన సీఎం
  • నివేదిక ఇవ్వాలని కలెక్టర్ కు ఆదేశం
పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా నవ్ జోత్ సింగ్ సిద్ధూ ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్తున్న కాంగ్రెస్ కార్యకర్తల మినీ బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. మోగా జిల్లాలోని లొహారా వద్ద ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును వారు ప్రయాణిస్తున్న మినీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్యకర్తలు మరణించారు. పది మంది దాకా తీవ్రంగా గాయపడ్డారు.

చండీగఢ్ లో జరుగుతున్న సిద్ధూ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్తున్నామంటూ ప్రమాదంలో స్వల్పగాయాలైన వారు చెప్పారు. గాయాలైన వారిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించామని ఎస్ఎస్పీ హర్మన్ బీర్ సింగ్ గిల్ తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే ప్రమాదముందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, వారంతా కూడా ఎమ్మెల్యే కుల్బీర్ సింగ్ జీరా అనుచరులని తెలుస్తోంది. మోగాకు 15 కిలోమీటర్ల దూరంలోని జీరా నుంచి వారు బయల్దేరారని చెబుతున్నారు.

ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేలా ఏర్పాట్లు చేయాలని మోగా జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. ప్రమాద ఘటనపై సమగ్ర నివేదిక పంపాలని సూచించారు.
Punjab
Congress
Navjot Singh Sidhu
Road Accident

More Telugu News