Mariamma: మరియమ్మ లాకప్‌డెత్ కేసు.. ఎస్సై సహా ముగ్గురు పోలీసులపై వేటు

Mariamma Lockup Deth Case three police suspended
  • రూ. 2 లక్షల దొంగతనం కేసులో మరియమ్మ విచారణ
  • తీవ్రంగా కొట్టడం వల్లే మరణించినట్టు విచారణలో తేలిన వైనం
  • మరియమ్మ మృతిపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు
  • తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం
మరియమ్మ లాక్‌డెత్ కేసులో తెలంగాణ ప్రభుత్వం ముగ్గురు పోలీసులపై వేటు వేసింది. రూ. 2 లక్షల దొంగతనం కేసులో ఖమ్మం జిల్లా చింతకాని మండలం కోమట్లగూడేనికి చెందిన మరియమ్మను గతనెల 18న యాదాద్రి జిల్లా అడ్డగూడూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు రోజు ఆమె కుమారుడు ఉదయ్‌కిరణ్, అతడి స్నేహితుడు వేముల శంకర్‌ను విచారించి రూ. 1.35 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మిగతా సొమ్ము కోసం మరియమ్మను పోలీస్ స్టేషన్‌లో విచారించారు. ఈ సందర్భంగా ఆమె స్పృహ కోల్పోవడంతో తొలుత స్థానిక ఆర్ఎంపీకి చూపించారు.

అనంతరం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు ఆమెను దారుణంగా కొట్టడం వల్లే మరియమ్మ మరణించిందని బాధిత కుటుంబ సభ్యులు, వివిధ పార్టీల నేతలు, దళిత, ప్రజా, విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు.

స్పందించిన ప్రభుత్వం విచారణకు ఆదేశించగా, పోలీసులు ఆమెను దారుణంగా కొట్టడం వల్లే స్పృహతప్పి పడిపోయిందని, వైద్య సదుపాయం అందించడంలో నిర్లక్ష్యం కారణంగానే ఆమె చనిపోయిందని తేలింది. మల్కాజిగిరి ఏసీపీ శ్యామ్‌ప్రసాద్‌రావు, రాచకొండ సీపీ మహేశ్ భగవత్ అందించిన విచారణ నివేదికను పరిశీలించిన ప్రభుత్వం.. ఎస్సై వి.మహేశ్వర్, కానిస్టేబుళ్లు ఎంఏ రషీద్, పి.జానయ్యలను విధులు నుంచి తొలగించారు.
Mariamma
Khammam District
Lockup Death
Telangana

More Telugu News