punjab: పంజాబ్ సీఎంకు సిద్ధూ సారీ చెప్పాల్సిందే: అమ‌రీంద‌ర్ సింగ్ మీడియా స‌ల‌హాదారు ట్వీట్ వైరల్

amarinder singh demnands sorry from sidhu
  • పంజాబ్ కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌ల్లో విభేదాలు
  • సిద్ధూని క‌ల‌వ‌బోన‌ని అమ‌రీంద‌ర్ పంతం
  • సామాజిక మాధ్య‌మాల్లో సిద్ధూ చేసిన వ్యాఖ్య‌ల‌పై తగ్గ‌ని ఆగ్ర‌హం
పంజాబ్ కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌ల్లో నెలకొన్న విభేదాలు తార‌స్థాయికి చేరుకున్నాయి. ఇటీవ‌లే కాంగ్రెస్ పంజాబ్ అధ్య‌క్షుడిగా నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ బాధ్య‌త‌లు చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. దీంతో ఆయ‌న‌కు ముఖ్యమంత్రి అమ‌రీందర్‌ సింగ్ వ‌ర్గం స‌హ‌క‌రించ‌కూడ‌ద‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పంజాబ్ అధ్య‌క్షుడిగా నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూకి బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డం ప‌ట్ల అమ‌రీందర్‌ సింగ్ అసంతృప్తితో ఉన్న‌ట్లు స‌మాచారం.

సిద్ధూ తనకు క్షమాపణలు చెప్పే వరకు కలవ‌బోన‌ని కొన్ని రోజులుగా ఆయ‌న అంటున్నారు. ఇప్ప‌టికీ అమ‌రీంద‌ర్ దీనిపై వెన‌క్కి త‌గ్గ‌డంలేదు. ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తూ అమరీందర్‌ సింగ్‌ మీడియా స‌ల‌హాదారు రవీన్‌ థుక్రాల్ ఓ ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రిని సిద్ధూ కలిసేందుకు అపాయింట్ మెంట్ అడిగార‌ని వ‌స్తోన్న ప్ర‌చారంలో నిజం లేద‌ని చెప్పారు.

ఏది ఏమైనా స‌రే ముఖ్యమంత్రి నిర్ణయంలో మార్పు లేదని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ సోషల్‌ మీడియాలో ముఖ్యమంత్రిపై చేసిన ఆరోపణలకు బహిరంగ క్షమాపణలు చెప్పే వరకు అమరీందర్‌ సింగ్‌ వెన‌క్కి త‌గ్గబోర‌ని ఆయ‌న చెప్పారు.
punjab
Amarinder Singh
Congress

More Telugu News