Nara Lokesh: వైసీపీ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారు...మరి నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఎక్కడ జగన్ గారు?: నారా లోకేశ్

Nara Lokesh fires  on Jagan
  • నిరుద్యోగుల ఉద్యమాన్ని నిర్బంధంతో అణచివేయలేరు
  • యువత ఉద్యమ స్ఫూర్తిని అభినందిస్తున్నా
  • అప్పటి సీఎంలు జగన్ మాదిరి ఉంటే.. ఇప్పుడున్న పోలీసులకు ఉద్యోగాలు ఉండేవా?
ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ను నిరసిస్తూ టీడీపీ అనుబంధ విభాగాలతో పాటు పలు విద్యార్థి సంఘాలు నిరసన కార్యక్రమాలను ఉద్ధృతం చేశాయి. తాడేపల్లిలోని జగన్ నివాసాన్ని ముట్టడించేందుకు ఈరోజు యత్నించాయి. అయితే విద్యార్థుల ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. నిరసనకారులను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలిస్తున్నారు. ఈ ఘటనపై టీడీపీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు.

వైసీపీ రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారని, మరి రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఎక్కడ జగన్ గారూ? అని లోకేశ్ ప్రశ్నించారు. నిరుద్యోగుల ఉద్యమాన్ని నిర్బంధంతో అణచివేయలేరని అన్నారు. కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, సీఎం ఇంటి ముట్టడి కార్యక్రమం సందర్భంగా మీ నిర్బంధాలకు, అక్రమ అరెస్టులకు ఎదురొడ్డి మరీ నిరసన తెలిపిన యువత ఉద్యమ స్ఫూర్తిని అభినందిస్తున్నానని చెప్పారు.

ఈరోజు ఏపీ ఉద్యోగ పోరాట సమితి ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తున్న కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ అధికారుల వరకు... సీఎం జగన్ రెడ్డి మాదిరే ఆనాటి ముఖ్యమంత్రులు ఉద్యోగాలను భర్తీ చేయకుంటే మీకు ఈరోజు ఉద్యోగాలు ఉండేవా? అని లోకేశ్ ప్రశ్నించారు. ఈ విషయం గురించి పోలీసులు ఆలోచించాలని అన్నారు. ఉద్యోగ పోరాట సమితి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో ఈ ఉద్యమం మహోద్యమంగా మారుతుందని హెచ్చరించారు.
Nara Lokesh
Telugudesam
Jagan
YSRCP

More Telugu News