Hyderabad: హైదరాబాద్ లోని స్టేట్ బ్యాంక్ లో కాల్పుల కలకలం

Gun firing at Hyderabad SBI
  • ఒప్పంద ఉద్యోగిపై కాల్పులు జరిపిన సెక్యూరిటీ గార్డు
  • ఉద్యోగి పక్కటెముకల్లోకి దిగిన బుల్లెట్లు
  • ఆర్థిక లావాదేవీలే కాల్పులకు కారణమని అనుమానం
హైదరాబాద్ గన్ ఫౌండ్రీలోని ఎస్బీఐ కార్యాలయం ఆవరణలో కాల్పుల ఘటన కలకలం రేపింది. బ్యాంకు వద్ద సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న సర్దార్ ఖాన్ అనే వ్యక్తి ఒప్పంద ఉద్యోగి సురేందర్ పై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో సురేందర్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో బ్యాంకు ఉద్యోగులు, అక్కడకు వచ్చిన కస్టమర్లు భయాందోళనలకు గురయ్యారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు వచ్చి సర్దార్ ఖాన్ ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. మరోవైపు గాయపడిని సురేందర్ ను చికిత్స నిమిత్తం హైదర్ గూడలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. సురేందర్ పక్కటెముకల్లో బుల్లెట్లు దిగాయని, అతనికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.
 
సర్దార్ ఖాన్ గత 20 ఏళ్లుగా అబిడ్స్ లోని ఎస్బీఐ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్నాడని బ్యాంకు సిబ్బంది తెలిపారు. సర్దార్ ఖాన్, సురేందర్ ఇద్దరూ మంచి స్నేహితులుగా ఉండేవారని చెప్పారు. ఆర్థిక లావాదేవీలే వివాదానికి కారణమై ఉండొచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
Hyderabad
SBI
Firing

More Telugu News