Sonu Sood: సినిమాలో సోనూసూద్‌ను కొడుతున్న హీరో.. తట్టుకోలేక టీవీని పగలగొట్టిన ఏడేళ్ల బాలుడు

boy broken TV due to hero beating sonusood
  • తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో ఘటన
  • సోనూ‌ను హీరో కొట్టడంతో కోపంతో ఊగిపోయిన బాలుడు 
  • సోనూసూద్ దృష్టికి వెళ్లిన విషయం   
  • ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన నటుడు
కరోనా సంక్షోభంలో ప్రజలకు ఆపద్బాంధవుడిగా నిలిచి వారి ఆదరాభిమానాలు చూరగొన్న ప్రముఖ సినీ నటుడు సోనూసూద్ ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచాడు. సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించే సోనూసూద్ తన దాతృత్వంతో దేశ ప్రజలకు రియల్ హీరోగా మారాడు. అలాంటి వ్యక్తికి ఏమైనా జరిగితే తట్టుకోవడం అభిమానులకు కష్టసాధ్యమే. అది సినిమా అయినా నిజ జీవితంలో అయినా!

అలాగే సోనూపై విపరీతమైన అభిమానాన్ని పెంచుకున్న ఏడేళ్ల కుర్రాడు సినిమా చూస్తూ తీవ్ర ఆవేశానికి గురయ్యాడు. ఆ సినిమాలో సోనూను హీరో కొడుతుండడాన్ని చూసి తట్టుకోలేక టీవీని పగలగొట్టేశాడు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

తెలంగాణలోని సూర్యాపేట జిల్లా హుజూర్‌‌నగర్ మండలం వేపలసింగారానికి చెందిన చండపంగు గురవయ్య, పుష్పలత తమ ఏడేళ్ల కుమారుడు విరాట్‌తో కలిసి ఓ శుభకార్యంలో పాల్గొనేందుకు న్యాల్కల్ వెళ్లారు. అనంతరం కుటుంబ సభ్యులందరూ కలిసి టీవీలో సినిమా చూస్తున్నారు. ఆ సినిమాలో విలన్ అయిన సోనూసూద్‌ను హీరో కొట్టడంతో కోపంతో ఊగిపోయిన ఏడేళ్ల విరాట్ పక్కనే ఉన్న రాయి అందుకుని టీవీని పగలగొట్టేశాడు.

దీంతో విస్తుపోయిన కుటుంబ సభ్యులు తేరుకుని టీవీని ఎందుకు పగలగొట్టావని ప్రశ్నించగా అతడు చెప్పిన సమాధానం వారిని మరింత ఆశ్చర్యపరిచింది. సోనూసూద్‌ను కొట్టడంతో తనకు కోపం వచ్చిందని, అందుకే టీవీని పగలగొట్టానని చెప్పడంతో వారు షాక్ తిన్నారు. ఈ విషయం సోనూసూద్ దృష్టికి వెళ్లడంతో, ఆయన దీనిని తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది.
Sonu Sood
Boy
TV
Cinema

More Telugu News