Kongunadu: తమిళనాడును బీజేపీ రెండు రాష్ట్రాలుగా విడగొట్టబోతోందంటూ ప్రచారం.. కనిమొళి స్పందన!

Kanimozhi response on Kongunadu
  • 10 జిల్లాలతో కేంద్రం కొంగునాడును ఏర్పాటు చేయబోతోందని ప్రచారం
  • తమిళనాడును విడదీయడం ఎవరి వల్ల కాదన్న కనిమొళి
  • బీజేపీ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందన్న పీసీసీ అధ్యక్షుడు అళగిరి
తమిళనాడులోని 10 జిల్లాలను విడగొట్టి కొంగునాడు పేరుతో ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. పశ్చిమ తమిళనాడు ప్రాంతమైన కొంగునాడును విడదీయబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది.

ఈ నేపథ్యంలో డీఎంకే ఎంపీ కనిమొళి కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడును విడదీయడం ఎవరి వల్ల కాదని అన్నారు. తమిళనాడు ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కనిమొళి చెప్పారు. తమిళనాడులో ప్రస్తుతం బలమైన, సురక్షితమైన ప్రభుత్వం ఉందని తెలిపారు.

తమిళనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీఎన్పీసీసీ) అధ్యక్షుడు కేఎస్ అళగిరి ఈ అంశంపై స్పందిస్తూ... బీజేపీ చేయాలనుకుంటున్న విభజన రాజకీయాలను ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించబోమని చెప్పారు. కొంగునాడు పేరుతో కొత్త రాష్ట్రం ఏర్పడే అవకాశమే లేదని అన్నారు. విభజన రాజకీయాలను తమిళ ప్రజలు ఒప్పుకోబోరని చెప్పారు. ఇతర రాష్ట్రాల విషయంలో విభజన జరిగి ఉండొచ్చని... తమిళనాడులో ఆ అవసరమే లేదని అన్నారు.

దొడ్డిదారిన తమిళనాడులో అడుగు పెట్టాలని బీజేపీ ప్రయత్నిస్తోందని... ఇలాంటి ఆలోచనల వల్ల ఆ పార్టీ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇటీవల జరిగిన కేంద్ర కేబినెట్ విస్తరణలో తమిళనాడు బీజేపీ మాజీ చీఫ్ మురుగన్ కు స్థానం కల్పించారు. మురుగన్ ను కొంగునాడుకు చెందిన వ్యక్తిగా మంత్రుల ప్రొఫైల్ లో కేంద్రం పేర్కొంది. దీంతో, కొంగునాడు పేరుతో కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే దిశగా ఊహాగానాలు చెలరేగాయి.
Kongunadu
Tamil Nadu
Seperate State
Seperate Tamil State
Kanimozhi

More Telugu News