Vishnu Vardhan Reddy: రాయలసీమ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ప్రకాశం టీడీపీ ఎమ్మెల్యేలు లేఖ రాస్తే చంద్రబాబు ఎందుకు ఖండించడం లేదు?: విష్ణువర్ధన్ రెడ్డి

Vishnu Vardhan Reddy seeks Chandrababu stand on TDP MLAs letter
  • తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలు
  • రాయలసీమ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న తెలంగాణ
  • ఈ ప్రాజెక్టు వల్ల ప్రకాశం జిల్లాకు నష్టమన్న టీడీపీ ఎమ్మెల్యేలు
  • సీఎం జగన్ కు లేఖ
  • టీడీపీ వైఖరేంటో స్పష్టం చేయాలన్న విష్ణు
రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు వల్ల ప్రకాశం జిల్లా ఎడారిగా మారిపోతుందంటూ ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రకాశం జిల్లాకు చెందిన ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు సీఎం జగన్ కు లేఖ రాయడం తెలిసిందే. దీనిపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. రాయలసీమ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు రాసిన లేఖను చంద్రబాబు ఎందుకు ఖండించడంలేదని ప్రశ్నించారు.

టీడీపీ ఎమ్మెల్యేలు లేఖ రాసిన తీరు చూస్తుంటే, తెలంగాణ ప్రభుత్వ వాదనకు, తెలంగాణ ప్రభుత్వ అసత్య ప్రచారాలకు వంతపాడే విధంగా ఉందని విష్ణు విమర్శించారు. సూటిగా చెప్పాలంటే కేసీఆర్ కు, టీఆర్ఎస్ పార్టీకి ఆ ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు కోవర్టుల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ ఎమ్మెల్యేలు సీఎం జగన్ కు లేఖ రాయడాన్ని ఏపీ బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని స్పష్టం చేశారు.

ప్రకాశం జిల్లాకో, రాష్ట్రంలో మరే ఇతర ప్రాంతానికో అన్యాయం జరుగుతుంటే మరో సందర్భంలో ప్రస్తావించవచ్చని, కానీ, తెలంగాణ ఇవాళ అక్రమంగా నీటిని దొంగిలించుకుపోతుంటే, దౌర్జన్యపూరితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సార్వభౌమాధికారం మీద దాడి చేస్తుంటే... ఓవైపు అధికార వైసీపీ చేతులెత్తేసిందని, బాధ్యతగా ఉండాల్సిన విపక్ష టీడీపీ ఎమ్మెల్యేలు లేఖ రాయడం ద్వారా సిగ్గుమాలిన చర్యకు పాల్పడ్డారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఈ అంశంలో టీడీపీ అధినేత చంద్రబాబు వెంటనే స్పందించి ప్రకాశం జిల్లాకు చెందిన ఆ ముగ్గురు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని విష్ణు డిమాండ్ చేశారు. వారు లేఖలో పేర్కొన్న అంశాలు తమ పార్టీ విధానం కాదని ఆయన వివరణ ఇవ్వాలని స్పష్టం చేశారు. ఒకవేళ అదే వారి పార్టీ విధానం అయితే టీడీపీ.. టీఆర్ఎస్ పార్టీకి బీ టీమ్ లా చరిత్రలో నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు.
Vishnu Vardhan Reddy
Chandrababu
TDP MLAs
Prakasam District
Letter
CM Jagan
Rayalaseema Project
Andhra Pradesh
Telangana

More Telugu News