Andhra Pradesh: బురద కాళ్లు కడుక్కునేందుకు.. నీటిగుంతలోకి దిగి నలుగురు స్నేహితుల గల్లంతు

Four Friends Drowned in Quarry
  • ఏపీలోని ప్రత్తిపాడులో విషాదం
  • ఇద్దరు స్నేహితులను కాపాడేందుకు మరో ఇద్దరి యత్నం
  • నలుగురూ నీళ్లల్లో మునిగిపోయిన వైనం
వాళ్లంతా స్నేహితులు. ఆదివారం కావడంతో ఆరుగురు మిత్రులు కలిసి బయటకు వెళ్లారు. సరదాగా గడిపారు. వారి స్నేహాన్ని చూసి విధి వెక్కిరించింది. నలుగురిని బలి తీసుకుంది. కాళ్లకు బురద అంటుకుందని క్వారీ గుంతలోకి దిగిన ఆ స్నేహితుల్లో.. నలుగురు గల్లంతయ్యారు. ఈ విషాద ఘటన ఏపీలోని ప్రత్తిపాడులో జరిగింది.

ఇగుటూరి వీర శంకర్ రెడ్డి (22), సిద్ధంశెట్టి వెంకటేశ్ (21), లంబు వంశీ (21), బిళ్లా సాయి ప్రకాశ్ (23), ఉదయగిరి హేమంత్, పాతపాటి యశ్వంత్ లు స్నేహితులు. వాళ్లంతా ఆదివారం ఉదయం తుమ్మలపాలెం డైట్ కాలేజీకి దగ్గర్లో ఉన్న క్వారీకి వెళ్లారు. అక్కడ చాలా సేపు సరదాగా గడిపారు. అయితే, వర్షం పడడంతో కాళ్లు బురదగా మారాయి. దీంతో కాళ్లు కడుక్కునేందుకు ముందుగా శంకర్ రెడ్డి, సాయి క్వారీగుంతలోకి దిగారు.

అయితే, కొంచెం ముందుకుపోగానే వారు మునిగిపోసాగారు. గమనించిన వెంకటేశ్, వంశీలు వారిని పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో ఆ నలుగురు క్వారీలో మునిగిపోయారు. అయితే, సాయి ప్రకాశ్ చేతులు పైకి ఎత్తి కాపాడాలంటూ కేకలు వేయడంతో యశ్వంత్ చేయందించాడు. కానీ, పైకి తీసుకురాలేకపోయాడు. విషయం తెలిసిన కుటుంబసభ్యులు.. అక్కడకు చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు.
Andhra Pradesh
Quarry
Crime News

More Telugu News