Mohammad Azharuddin: బీసీసీఐ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా హెచ్‌సీఏ చీఫ్ అజారుద్దీన్

Azharuddin part of the BCCI working group for domestic cricket
  • గంగూలీ ఆధ్వర్యంలో పది మంది సభ్యులతో ప్యానెల్
  • దేశవాళీ ఆటగాళ్లకు పరిహార ప్యాకేజీతోపాటు ఇతర అంశాల పర్యవేక్షణ
  • గత నెల బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్‌తో తీసుకున్న నిర్ణయం మేరకు ప్యానెల్ ఏర్పాటు
దేశవాళీ క్రికెట్ వ్యవహారాల పర్యవేక్షణ కోసం బీసీసీఐ ఏర్పాటు చేసిన వర్కింగ్ గ్రూపులో టీమిండియా మాజీ సారథి, హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) చీఫ్ మహ్మద్ అజారుద్దీన్‌కు చోటు లభించింది. రోహన్ జైట్లీ, అవిషేక్ దాల్మియా కూడా ఈ గ్రూపులో ఉన్నారు. ఈ ప్యానెల్‌లో ఉన్న మిగతా వారిలో యుధ్‌వీర్ సింగ్ (సెంట్రల్ జోన్), దేవజీత్ సైకియా (నార్త్‌ఈస్ట్ జోన్), సంతోష్ మేనన్ (సౌత్ జోన్) ఉన్నారు. బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, కార్యదర్శి జై షా, కోశాధికారి అరుణ్ ధుమాల్‌తో ఏర్పాటైన ఈ ప్యానెల్ గంగూలీ ఆధ్వర్యంలో పనిచేస్తుంది.

కరోనా కారణంగా గతేడాది రద్దైన సీజన్‌కు సంబంధించి దేశవాళీ ఆటగాళ్లకు పరిహార ప్యాకేజీతోపాటు దేశవాళీ క్రికెట్‌లోని ఇతర అంశాలపై ఈ 10 మంది సభ్యుల ప్యానెల్ పనిచేస్తుంది. గత నెల 20న బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్‌లో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ ప్యానెల్‌ను ఏర్పాటు చేశారు.  

టీమిండియా మాజీ సారథి అయిన అజారుద్దీన్ ప్రస్తుతం హెచ్‌సీఏ హెడ్‌గా ఉండగా, ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ)కు జైట్లీ చీఫ్‌గా ఉన్నారు. మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ అయిన షా సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ చీఫ్ కాగా, క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్‌కు దాల్మియా హెడ్‌గా ఉన్నారు. సంతోష్ మేనన్ కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ హెడ్‌గా సేవలందిస్తున్నారు.
Mohammad Azharuddin
BCCI
working group
Domestic Cricket

More Telugu News