Telangana: తెలంగాణలో కుండపోత వానలు.. పొంగిపొర్లుతున్న వాగులు

Heavy Rains in Telangana due to low pressure in bay of bengal
  • అల్పపీడన ప్రభావంతో జోరుగా కురుస్తున్న వానలు
  • వాగులో కొట్టుకుపోయి ఇద్దరు, పిడుగుపాటుకు ఒకరి మృతి
  • నేడు, రేపు కూడా వానలు
  • రాష్ట్రంలో నిన్న 42 ప్రాంతాల్లో అతి భారీ వర్షం
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నిన్న తెలంగాణ వ్యాప్తంగా జోరు వానలు కురిశాయి. పలు జిల్లాల్లో కుండపోత వానలు పడ్డాయి. వర్షాలు విస్తారంగా కురవడంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. గాలి వానకు పలుచోట్ల చెట్లు విరిగిపడగా, మరికొన్ని చోట్ల కరెంటు స్తంభాలు నేలకొరిగాయి. పలుచోట్ల రోడ్లు తెగిపోవడంతో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది.

రాష్ట్ర వ్యాప్తంగా 42 ప్రాంతాల్లో అతి భారీ వర్షం కురవగా 241 ప్రాంతాల్లో సాధారణ వర్షం కురిసింది. 541 ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడన ప్రభావం నేడు, రేపు కూడా ఉంటుందని పేర్కొంది. తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. వరంగల్ జిల్లా చెన్నారావుపేటలో అత్యధికంగా 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం సంతాయిపేటలో భీమేశ్వర వాగు పొంగి పొర్లుతుండడంతో భీమేశ్వరస్వామి దర్శనానికి వెళ్లిన 23 మంది భక్తులు వాగు అవతల చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఎక్స్‌కవేటర్ సాయంతో వారిని ఇవతలి ఒడ్డుకు చేర్చారు. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని కోర్టికల్‌ జలపాతంలో పడి గుర్తుతెలియని వ్యక్తి(40) మరణించగా, బోథ్‌ మండలం కుచలాపూర్‌‌కు చెందిన గుండెన స్వామి(34) కుమారి వాగులో కొట్టుకుపోయి మృతిచెందాడు.

వరంగల్‌ రూరల్‌ జిల్లా నర్సంపేట మండలం గురిజాలకు చెందిన గడ్డం అనిల్‌(37) బైక్‌పై ఊరికి వస్తూ మార్గమధ్యలో పెద్దంచెరువు వాగును దాటే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు వాగులో పడి గల్లంతయ్యాడు. సంగారెడ్డి జిల్లా కల్హేర్‌ మండలం మార్డిలో పిడుగుపడి ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది.
Telangana
Heavy Rains
Low Pressure

More Telugu News