VV Vinayak: హిందీ 'ఛత్రపతి' కోసం రాజమౌళిని కలవనున్న వినాయక్!
- సెట్స్ పై 'ఛత్రపతి' హిందీ రీమేక్
- కథలో కొన్ని మార్పులు .. చేర్పులు
- అదే బ్యానర్లో వినాయక్ మరో మూవీ
- త్వరలోనే పూర్తి వివరాలు
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్లలో 'ఛత్రపతి' ఒకటి. ప్రభాస్ స్టార్ డమ్ ను .. మాస్ ఆడియన్స్ లో ఆయన క్రేజ్ ను అమాంతంగా పెంచిన సినిమా ఇది. విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథను అందించారు. 2005లో సంచలన విజయాన్ని నమోదు చేసిన ఈ సినిమాను ఇప్పుడు హిందీలో రీమేక్ చేస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వీవీ వినాయక్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. పెన్ మూవీస్ బ్యానర్లో నిర్మితమవుతున్న ఈ సినిమాను గురించి, తాజాగా వినాయక్ మాట్లాడారు.
''హిందీ రీమేక్ 'ఛత్రపతి' కోసం కూడా విజయేంద్రప్రసాద్ గారు పనిచేస్తున్నారు. బాలీవుడ్ ఆడియన్స్ టేస్టుకు తగినట్టుగా ఆయన కొన్ని మార్పులు .. చేర్పులు చేశారు. రాజమౌళి బిజీగా ఉండటం వలన ఆయనను కలవడం కుదరలేదు. ఈ సినిమా విషయంపై త్వరలో ఆయనతో కూర్చోవాలి. 'ఛత్రపతి' సినిమాను రీమేక్ చేయాలని నేను అనుకోలేదు. పెన్ మూవీస్ వారే వచ్చారు'' అన్నారు వినాయక్. ఇదే బ్యానర్లో మరో సినిమాను కూడా చేయనున్నట్టు చెప్పారు. త్వరలో ఆ సినిమాకి సంబంధించిన విశేషాలను వెల్లడిస్తానని అన్నారు.