GP Singh: సస్పెన్షన్ కు గురైన ఐపీఎస్‌ అధికారి జీపీ సింగ్ పై దేశద్రోహం కేసు

Sedition case filed against GP Singh IPS
  • అక్రమాస్తుల కేసులో గత వారమే సస్పెండ్ అయిన సింగ్
  • ఇంట్లో సోదాల సందర్భంగా కీలక పత్రాల స్వాధీనం
  • దేశద్రోహం కేసు నమోదు చేసిన చత్తీస్ గఢ్ పోలీసులు
సీనియర్ ఐపీఎస్ అధికారి జీపీ సింగ్ పై చత్తీస్ గఢ్ పోలీసులు దేశద్రోహం కేసును నమోదు చేశారు. అక్రమాస్తుల కేసులో గత వారమే ఆయన సస్పెన్షన్ కు గురయ్యారు. అయితే ఆయన ఇంట్లో సోదాల సందర్భంగా కీలకమైన పత్రాలు దొరికాయి. రెండు వర్గాల మధ్య విభేదాలు, ఘర్షణలను పెంచేలా... ప్రభుత్వం, ప్రజాప్రతినిధులపై ఆయన కుట్ర పన్నినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో, ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేశారు. రాయ్ పూర్ లోని కొత్వాలి పోలీస్ స్టేషన్ లో ఐసీపీ సెక్షన్లు 124ఏ, 153ఏ కింద కేసు నమోదు చేశారు.

జీపీ సింగ్ కు చెందిన 15 చోట్ల ఏసీబీ, ఈఓడబ్ల్యూలు సోదాలు నిర్వహించాయి. ఈ సోదాల్లో ఆయన వద్ద దాదాపు రూ. 10 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. గతంలో ఏసీబీ అడిషనల్ డైరెక్టర్ గా కూడా సింగ్ పని చేశారు. మరోవైపు సీఎం భూపేశ్ బాగెల్ మాట్లాడుతూ, పోలీసులు స్వాధీనం చేసుకున్న పత్రాల ఆధారంగా జీపీ సింగ్ పై చర్యలు తీసుకున్నామని చెప్పారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర పన్నిట్టు ఆ పత్రాలు సూచిస్తున్నాయని తెలిపారు. మరవైపు దేశద్రోహం కేసును సవాల్ చేస్తూ హైకోర్టును సింగ్ ఆశ్రయించారు. ఈ ఘటనపై సీబీఐ వంటి సంస్థల చేత దర్యాప్తు చేయించాలని కోర్టును కోరారు.
GP Singh
IPS
Sedition Case
Chhattisgarh

More Telugu News