Panchumarthi Anuradha: షర్మిల అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పే దమ్ము జగన్‌కు, వైసీపీకి ఉందా?: పంచుమర్తి అనురాధ

Can Jagan answer Sharmilas question asks Panchumarthi Anuradha
  • స్వప్రయోజనాల కోసం ఏపీ ప్రయోజనాలను తాకట్టు పెట్టారు
  • కేసీఆర్ తో చాలా మంది వైసీపీ నేతలకు సంబంధాలు ఉన్నాయి
  • వైయస్ హయాంలో జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం జరిగింది
వైయస్సార్ తెలంగాణ పార్టీ ఆవిర్భావ సభ సందర్భంగా వైయస్ షర్మిల కీలక ప్రసంగం చేసిన సంగతి తెలిసిందే. ప్రసంగం మధ్యలో ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలు, ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ఉన్న సాన్నిహిత్యం తదితర అంశాలను ఆమె ప్రస్తావించారు. ఇద్దరూ కలిసి భోజనాలు చేశారని, ఉమ్మడి శత్రువును ఓడించారని... అలాంటప్పుడు జల వివాదాన్ని పరిష్కరించుకోలేరా? అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ పై టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ విమర్శలు గుప్పించారు.

నీటి పంచాయతీపై షర్మిల అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పే దమ్ము, ధైర్యం జగన్ కు, ఆయన పార్టీ నేతలకు ఉందా? అని ప్రశ్నించారు. స్వప్రయోజనాల కోసం ఏపీ ప్రయోజనాలను జగన్ సహా వైసీపీ నేతలు ఢిల్లీలో తాకట్టు పెట్టారని అనురాధ అన్నారు. కేసీఆర్ తో చాలా మంది వైసీపీ నేతలకు సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. జగన్ చేసిన మోసాలకు ఒక చెల్లెలు ఢిల్లీలో పోరాడుతుంటే, మరొక చెల్లెలు హైదరాబాదులో పోరాడుతోందని అన్నారు.

వ్యవసాయ రంగానికి ఏం చేశారని వైయస్ జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకున్నారని అనురాధ ప్రశ్నించారు. రైతు సంకెళ్ల దినోత్సవాలు, రైతు కన్నీటి దినోత్సవాలను జరుపుకోవాలని ఎద్దేవా చేశారు. వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఎరువుల కోసం క్యూలో నిలబడిన రైతులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆ విధంగా నాడు సోంపేట, కాకరాపల్లి, ముదిగొండలో 12 మంది రైతులను బలిగొన్నారని అన్నారు. వైయస్ హయాంలో జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం జరిగిందని చెప్పారు. వైయస్ హయాంలో గిట్టుబాటు ధర లేక 14 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. ఆరోజుల్లో వైయస్, ఇప్పుడు జగన్ ఇద్దరూ... వారి ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వాల ముందు సాగిలపడ్డారని మండిపడ్డారు.
Panchumarthi Anuradha
Telugudesam
YS Sharmila
YSRTP
Jagan
YSRCP

More Telugu News