Nellore District: నెల్లూరు ప్రజలకు కృతజ్ఞతలు!: సోనూసూద్

- ఇప్పటికే నెల్లూరుకు ఆక్సిజన్ ప్లాంట్
- హారతులు ఇస్తూ, బాణసంచా కాల్చుతూ సంబరాలు
- మరో వీడియోను పోస్ట్ చేసిన సోనూసూద్
సినీనటుడు సోనూసూద్ సాయంతో ఆక్సిజన్ ప్లాంట్ నెల్లూరుకు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అక్కడి ప్రజలు దానికి హారతులు ఇస్తూ, బాణసంచా కాల్చుతూ సంబరాలు చేసుకున్న వీడియోను సోనూసూద్ ఈ రోజు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఘనస్వాగతం పలికినందుకు నెల్లూరు ప్రజలకు కృతజ్ఞతలు చెబుతున్నట్లు సోనూసూద్ పేర్కొన్నారు. ఆక్సిజన్ ప్లాంటు చాలా మంది ప్రాణాలను కాపాడుతుందని ఆయన చెప్పారు.
ఆక్సిజన్ ప్లాంట్ తీసుకొచ్చిన ట్రక్ కు ఉన్న సోనూసూద్ ఫ్లెక్సీకి మహిళలు బొట్లు పెట్టారు. 'థ్యాంక్యూ సోనూసూద్' అంటూ ఉన్న పోస్టర్లను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో స్థానికులతో పాటు వైద్యులు, నర్సులు కూడా పాల్గొన్నారు. కాగా, కరోనా రెండో దశ విజృంభణలో ఆక్సిజన్ కొరత ఏర్పడటంతో చాలామంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో చలించిపోయిన సోనూసూద్ ఏపీలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తానని చెప్పి, ఆ మాటను నిలబెట్టుకున్నారు.