Vijayashanti: పారాసిటమాల్ తో కరోనా తగ్గేట్టయితే సీఎం కేసీఆర్ యశోదా ఆసుపత్రిలో ఎందుకు చేరినట్టు?: విజయశాంతి

Vijayasanthi comments on CM KCR over corona matters
  • జూబ్లీహిల్స్ లో వ్యాక్సినేషన్ సెంటర్ కు వెళ్లిన విజయశాంతి
  • అక్కడి పరిస్థితులపై పరిశీలన
  • ప్రభుత్వంపై విమర్శలు
  • సిరంజిలు ప్రభుత్వమే సమకూర్చాలని వెల్లడి
బీజేపీ మహిళా నేత విజయశాంతి ఇవాళ హైదరాబాదు జూబ్లీహిల్స్ లోని శ్రీరాంనగర్ లో ఏర్పాటు చేసిన కరోనా వ్యాక్సినేషన్ సెంటర్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఇక్కడ కరోనా వ్యాక్సినేషన్ తీరుతెన్నులను గమనించేందుకు వచ్చామని వెల్లడించారు. రోజుకు 200 మంది వరకు ఇక్కడ వ్యాక్సిన్ పొందుతున్నట్టు అధికారులు చెప్పారని, కొవిషీల్డ్ ఇస్తున్నట్టు వెల్లడించారని విజయశాంతి తెలిపారు.

అయితే, సిరంజిలు ప్రజలే స్వయంగా తెచ్చుకోవాలని వ్యాక్సిన్ సిబ్బంది చెప్పడం సరికాదని, ప్రభుత్వమే అన్ని ఏర్పాట్లు చేయాలని హితవు పలికారు. ఆఖరికి సిరంజిలు కూడా ప్రజలే తెచ్చుకునేట్టయితే ఈ ప్రభుత్వం ఉన్నది ఎందుకని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్లను ఉచితంగా అందించాలని ప్రధాని మోదీ ప్రకటించారని, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని, తమవంతు విధి నిర్వహణ సక్రమంగా చేయాలని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా విజయశాంతి సీఎం కేసీఆర్ పైనా స్పందించారు. కరోనా వస్తే పారాసిటమాల్ మాత్రలు వేసుకోవాలని చెబుతున్న సీఎం కేసీఆర్... తనకు కరోనా వస్తే యశోదా ఆసుపత్రిలో ఎందుకు చేరినట్టు? అని ఆమె నిలదీశారు. కరోనా సోకినప్పుడు సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొంది ఉంటే బాగుండేదని వ్యంగ్యం ప్రదర్శించారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ బాధ్యతగా తాను కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని, కేసీఆర్ బాధ్యతగా వ్యవహరించి ఉంటే రాష్ట్రంలో ఇన్ని ప్రాణాలు పోయేవి కావని పేర్కొన్నారు.
Vijayashanti
CM KCR
Corona
Vaccination
Hyderabad
Telangana

More Telugu News